పుట:Baarishhtaru paarvatiisham.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆపితే బాగుండును. దిగి వెళ్ళి రావచ్చు ననుకొన్నాను. గొలుసు లాగుదామా అనుకొని, ఏభైరూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికివెళ్ళి రైలు ఒక్క మాటు ఆపమని గార్డుగారిని కేకవేశాను. నాకేక ఎవళ్ళకీ వినపడ లేదు. కడుపు ఉబ్బుకు వస్తోంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్దమనిషి నొకాయనను పలకరించి, నా అవస్థ చెప్పి 'ఇలా కేకవేశాను. ఎవళ్ళూ పలకలేదు. ఎలాగు' అని అడిగాను. ఆయన నవ్వి 'అబ్బాయీ, వట్టి వెర్రివాడివలె వున్నావు. మనకు కావలసిన చోటల్లా రైలు ఆపరు. ఇక్కడే గది ఉంది. ఒకటికి వెళ్ళవలసి వచ్చినా, రెంటికి వెళ్ళవలసి వచ్చినా, ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని' చెప్పి గది చూపించారు.

వెళ్ళి, వచ్చి కూర్చుని కాస్సేపు కునికిపాట్లు పడేసరికి తెల్ల వారింది. చక్కగా రైలు ప్రతి స్టేషనులోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైలులో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర లేకుండా అందులోనే పాయఖానా, ప్రతి స్టేషనులోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము; అన్ని ఏర్పాట్లూ బహు బాగున్నవను కొన్నాను. అందుకనే ఇంగ్లీషువాళ్ళు అంత గొప్ప వాళ్లయినా రనుపించింది.

ఇలా ఉండగా ఉదయము తొమ్మిది గంటలయే సరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్ లో దిగేజనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒకాయన నల్లదొర నా దగ్గిరికి వచ్చి టిక్కట్టు ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిటిరా టిక్కట్టు తీసుకు పోతున్నాడు. ఏమన్నా గట్టిగా అడగ డానికైనా-నల్లగా ఉన్నా--దొర కూడాను! నా