పుట:Baarishhtaru paarvatiisham.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంచె మించు మించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగీ ఆగడములో ఎదురుగుండా వున్న పెట్టెలోకి నా సామానునెత్తినపెట్టుకుని ఎక్కబోయాను. ఒకమెట్టు ఎక్కి రెండమెట్టుమీద కాలు వెయ్యబోతూ వుంటే వెనక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నానెత్తిమీద ఉన్న సామాను, నావెనక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండ కింద ఎవళ్ళో కాళ్ళమీద దభీ మని పడ్డది. నేను సామానుకోసము వెనుక్కు తిరిగి చూశాను. ఆపళంగా చెయ్యిజారి నావెనక వాడిమీద నేనూ, నావెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళమీద విరుచుకు పడ్డాము. మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడము మొదలు పెట్టారు. కొందరు మామీదనుంచి నడిచిపోయి రైలెక్కారు నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తరువాత చూసుకోవచ్చునని ముందు రై లెక్కాను.

రైలెక్కి సామాను పైన పెట్టు కొంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలించి. నావెనుక బల్లమీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ నాలుగు ఆశీర్వవచనముల తోటి ముందుకు గెంటింది నా ఎదుట బల్లమీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ, అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపుమీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కు మన్నది. నేను మొర్రో అన్నాను. ఆనందసమాధిలో నుంచి కొంచెము మెలుకువ తెచ్చుకుని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమో అని చూచాడు కాబోలు, కెవ్వుమని కేకవేసి ఏపామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్లపైన పడబోయి ఆపిల్ల నలిగిపోతుందేమోననే భయముతో ఎలాగో