పుట:Baarishhtaru paarvatiisham.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరేఊరికి వెళ్ళుతారని, నాకు ఒళ్ళుమండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టరుగారి దగ్గిరకు వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా 'ఎక్కడికి వెళ్ళా ' లన్నారు. టికెట్టు ఇవ్వడానికంటే ఊరుపేరు చెప్పితేనేకాని ఇవ్వడానికి వీలులేదంటే చెప్పాను. టిక్కట్టు కొన్న తరవాత కూడా వీళ్ళకీ పరీక్షలన్నీ ఎందుకూ? వీళ్ళరోగము కుదురుద్దామని 'రాజమహేంద్రవరాని ' కన్నాను. అయితే 'ఎక్కవచ్చు ' నన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాష్టరు అక్కడే ఉన్నాడు. రైలు కదిలించి.

ఆయన్ని పిలిచి 'ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశాలెండి. నేను రాజమహేంద్ర వరము వెళ్ళడములేదు. చెన్నపట్నం వెళ్ళుతున్నాను ' అని నవ్వుతూ చెప్పాను.

ఆయన ఆపాళంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను.

'త్వరగా దిగవయ్యా, ఆలస్య మవుతున్నది '

'నేనెందుకు దిగాలి?'

'ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్ లాగా ఉన్నావు. దిగు. '

'ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి. నేను దిగను ' అంటే రైలులో వాళ్ళంతా నవ్వడము మొదలు పెట్టారు. ఇంతలోనే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించారు. రైలు వెళ్ళి పోయింది. నా కళ్ళవెంబడి నీళ్ళు వచ్చినవి. స్టేషన్ మాష్టరు కొంచెము చీవాట్లువేసి పట్నంబండి యింకొక పావు గంటలో వస్తుం దని ధైర్యము చెప్పాడు.