పుట:Baarishhtaru paarvatiisham.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగతి అడగడానికి రాలేదండీ. మిమ్మలిని చూస్తే ఏమి జ్ఞాపకము వస్తుందో చెప్పడానికి వచ్చానండీ ' అన్నాను.

'ఏం జ్ఞాపకము వస్తున్నది?'

'మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటిరాయా, మీ తలకాయ చూస్తే సున్నపు పిడతా జ్ఞాపకము వస్తున్న ' వన్నాను.

అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతు తనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను.

అక్కడనుంచి తిన్నగా దగ్గిర వున్న హోటలుకు వెళ్ళి భోజనము చేసి కాస్సేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసివద్దా మని వెళ్ళాను అక్కడ అటూ యిటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మరిచి పోయినట్లు జ్ఞాపకము వచ్చింది. అవేమిటంటే, గదికి తాళము వేసుకోడానికి చిన్న ఇత్తడి తాళమూ, స్నానానంతరము బట్టలు ఆరవేసుకోడానికి కొబ్బరిపీచుచేంతాడూ, బట్టలు తగిలించుకోడానికి నాలుగు పెద్దమేకులూ. ఈ మూడు వస్తువులూ కొనుక్కుని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలము కాగానే పెందరాడే భోజనము చేసి స్టేషన్ కు వచ్చాను. టిక్కట్ల వేళ అయింది.

నేను వెళ్ళి చెన్నపట్నానికి టిక్కట్టు పుచ్చుకొన్నాను. ఇవతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని, ఈ రైలు ఎక్కవచ్చునా? అన్నాను.

'మీ రేఊరు వెడతారు?' అన్నాడు వాడు.

'నీ కెందు కా ప్రశంస?' అని చక్కా పోయాను.

అక్కడొక పద్దమనిషి ఉంటే, ఆయన్నే అడిగాను -ఈ రైలు ఎక్కవచ్చునా?' అని. ఆయనా అదేప్రశ్న వేశాడు-