పుట:Baarishhtaru paarvatiisham.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తా జా క లం

పై వ్రాసిన పంక్తులు, మొట్ట మొదట ప్రచురించిన ఈ పుస్తకానికి ప్రవేశిక లోనివి. అంతకంటె విశేషించి వ్రాయవలసిన దేమీలేదు. కాని ఒక ముక్క-- ఈ పుస్తకము ప్రారంభించి నప్పుడు పుస్తకం వ్రాదా మను కోలేదు. మద్రాసు వరకూ ప్రయాణం కులాసాగా వ్రాశాను ఏమీ తోచక. మద్రాసులో పార్వతీశాన్ని ఏమి చేయ్యాలో తోచక విదేశాలకు తీసుకు వెళ్ళాను. మీరు కులాసాకు చదివినట్లుగానే నేనూ కులాసాకు వ్రాశాను. మరో దురుద్దేశమేమీలేదు.

ఏకారణం చేతనో ఆంధ్ర రసిక హృదయం, ఆనందించి విశేషంగా నన్నాదరించింది. ఆ ప్రధమ తప్పిదానికి శిక్షగా పార్వతీశం దేశంలో పాతుకు పోయాడు. నేనేం చెయ్యను చెప్పండి! అక్కడికీ అప్పటినుంచీ నేను మట్టుకు మళ్లీ తొందరపడి ఇలాటివి వ్రాయడం లేదు. అయినా ఏవేళకు ఏమి బుద్ధిపుడుతుందో ఏం చెప్పను. పొరపాటున ఏదేనా వ్రాసినా ముప్ఫై సంవత్సరముల నుంచి ఆదరిస్తున్న రసికు లీ నాడు నన్ను విడిచి పెట్టరనే ధైర్యం పూర్తిగా ఉంది. నమస్తే అనే కంటె ఇంకేమి అనలేకుండా వున్నాను.

నమస్తే.

--మొ|| న|| శా.