పుట:Baarishhtaru paarvatiisham.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరుత్సాహపడి నిరాశజెందిన వాడికైనా శరీరానికి ఉత్సాహమున్నూ మనస్సుకు వికాసమున్నూ కలిగిస్తుంది. అందుకని ప్రస్తుతమున్న ఆంధ్రజాతి స్వభావములోని హాస్యజనకమైన విషయాన్ని మాత్రము ఒక వ్యక్తిగాజేసి ఈ కథ వ్రాశాను.

ఇంతవరకూ మన భాషలో హాస్యరస ప్రధానమైన గ్రంథాలు చాలా తక్కువ. అటువంటి పుస్తకము ఒక్కటీ మనభాషలో లేకపోవడమువల్ల హాస్యము చూపించడానికి మన భాషలో వీలులేదేమో ననుకుంటుండేవాణ్ని. పూర్వకవులు బూతులో తిట్లో ఉంటేనే కాని హాస్యము కాదనుకున్నారేమోనని తోస్తున్నది. ఆధునికులలో శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు, శ్రీ గురజాడ అప్పారావుగార్లు హాస్యగ్రంథరచన చేసి మార్గదర్శకులయ్యారు.

నిత్యమూ మనకు అనుభవమయ్యే ఏ అత్యల్ప విషయాన్నో తీసుకుని చాలా చమత్కారంగా నవ్వు వచ్చేటట్టు చెప్పడము ఆంధ్రలోకానికి నేర్పినవారు శ్రీ చింతా దీక్షితులుగా రొక్కరే. వీరు 'సాహితి' మొదలైన పత్రికల్లో వ్రాసిన కథలు చదివినప్పటినుంచీ తెలుగులో కూడా హాస్య రసము బాగా ఒప్పించవచ్చు నని తెలుసుకున్నాను.

ఈ గ్రంథము వ్రాయడానికి శ్రీ దీక్షితులుగారి కథలే కాకుండా వారు స్వయముగా చాలవరకు ప్రోత్సాహము చేశారు.