పుట:Baarishhtaru paarvatiisham.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు వెళ్ళి గార్డును తీసుకువచ్చాడు, వాడు చెప్పినా దిగనన్నాను. కిటికీ తలుపుకేసి చూపించాడు. దానిమీద (Des Dames) అని రాసి ఉంది, అదేమిటో నాకర్థం కాలేదు. బాగానే ఉంది సంతోషించా నన్నాను. దిగమన్నాడు. ఎందుకుచేత నన్నాను. వాడికేమీ తోచక, స్టేషన్ మాస్టరును తీసుకువచ్చాడు. ఆ పెద్ద మనిషికి కొంచెం ఇంగ్లీషు వచ్చు. ఆయన వచ్చి సవ్యమైన భాషలో అది ఆడవాళ్ళ పెట్టె గనుక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకోపెట్టెలో కూచోబెట్టాడు.

మధ్యాహ్నం బొలోస్ చేరాను. దిగి స్టీమరెక్కాను. ఆ స్టీమరు చాలా చిన్నది. సముద్రమా మహా హడావిడిగా ఉంది. అందుకని ప్రతివాళ్ళకూ వికారమూ, వాంతులూ. అన్నాళ్లు స్టీమరు ప్రయాణం చేసినా ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. అందరూ తలో మూలా ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు. ఈ అవస్థ ఎప్పుడు వదులుతుందా అనుకొన్నాను. మొత్తంమీద రెండు గంటలకంటె ఎక్కువ పట్టలేదు. కాని ఆ కాస్త సేపూ యుగం లాగ ఉంది.

ఫోక్ స్టనులో దిగేటప్పటికి సుమారు అయిదు గంటలవుతుంది. ఇంగ్లండులో అడుగు పెట్టానన్నమాట జ్ఞాపకం పెట్టుకొని మొదట కుడికాలే పెట్టాను. మనసులో ఒక విధమైన ఆందోళన బయలు దేరింది. గుండెల్లో అదురు పుట్టింది. ఇంతవరకూ మొండి తనంగా కొట్టుకొచ్చాను. ఇక ముందేమో అని ఆలోచన పోయింది. అన్నింటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక్క దణ్ణం పెట్టుకున్నాను.

మొదటి భాగం

పూర్తి అయింది.