పుట:Baarishhtaru paarvatiisham.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సొమ్ము చెల్లిస్తోంటే ఇద్దరు నౌకర్లు అక్కడవచ్చి నిలబడ్డారు. వెళ్లిపోతున్నాముకదా వాళ్ళకేమైనా బహుమతిచేస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించి వాళ్ళందరికి తలొక అణా ఇచ్చాను. ఇచ్చినందుకు సంతోషించవచ్చునా! ఆ అణాకాసుని ఇటుతిప్పి అటుతిప్పి వాసనచూచి గుమాస్తాదగ్గర ఒక లెన్సు అడిగి పుచ్చుకుని, దానితోటి పరీక్షచేసి మూతి విరుచుకుని అక్కడ పారేసి చక్కాపోయారు. వాళ్ళ పొగరు మోత్తనము చూస్తే మట్టుకు నాకు చాలా కోపము వచ్చింది. డబ్బంటే తేరగా వస్తుందనుకున్నారు కాబోలు! వాళ్ళ కింతకంటే మహా ఎక్కువిచ్చే దెవడు! తీసుకో కేం చేస్తారని నాదారిని నేను రైలుకి వెళ్ళిపోయాను.

కుక్ వారి మనిషి ఫోక్ స్టను కొక టిక్కట్టుకొని ఇచ్చి, పారిసులో రైలు మార్చుకోమనీ మళ్లీ బోలోనులో దిగి స్టీమ రెక్కుతే ఫోక్ స్టను అనే ఊరు చేరుతావనీ చెప్పాడు.

రైలు సామాన్యంగా మన దేశపు రైలుకు మల్లేనే ఉంది. ఎటొచ్చీ పెట్టెలింకా కొంచెము విశాలంగా ఉన్నాయి. మూడవ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి.

తెల్లవారే సరికి పారిసు చేరాము. అక్కడ దిగి దంత ధావనాదికములు కానిచ్చి కొత్త రైలు దగ్గరికి వెళ్ళాను. జనం కిటకిట లాడుతూ ఉన్నారు. రెండు పెట్టెలు మట్టుకు ఖాళీగా ఉన్నాయి. అవీ మూడో తరగతివే కదా అని వెళ్ళి కూచున్నాను. ఇంకో నిముషాని కొక దొరసాని వచ్చి నన్ను చూచి ఒక బంట్రోతును కేకేసి నన్ను దింపమని చెప్పిందని తోస్తుంది. బంట్రోతు నన్ను దిగమన్నాడు. ఫ్రెంచిలో అనేక విధాల ఏమేమిటో చెప్పాడు. ఏమయినా సరే, ఇందులో నుంచి దిగనన్నాను.