పుట:Baarishhtaru paarvatiisham.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బొంత తీసి కుర్చీమీద మడిచిపెట్టి నా శాలువ కప్పుకుని, మరునాడే నా డబ్బు వస్తుందా రాదా, రాక పోతే మన గతేమి కానని ఆలోచిస్తూ నిద్రపోయాను.

పొద్దున్నే ఒక బంట్రోతు వచ్చి లేపాడు. వాడు నన్ను చూసి ఏదో అని చక్కాపోయాడు. ఇంకొక క్షణాని కింకొకడు వచ్చాడు. వాడూ లోపలికి తొంగిచూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఆ హోటల్లో ఉన్న నౌకర్లంతా ఒక్కక్కళ్లే వచ్చి గదిలోకి తొంగిచూడడమూ, నవ్వుకుంటూ పరుగెత్తడమూను, ఇదంతా చూస్తే నాకు వొళ్లు మండుకొచ్చింది. తిన్నగా వెళ్లి గుమాస్తాతోటి చెప్పి అతన్ని పైకి తీసుకు వచ్చాను. మేము వచ్చేటప్పటికి నలుగురైదుగురు బంట్రోతులింకా అక్కడ నుంచుని విరగబడి నవ్వుతున్నారు. మమ్మల్ని చూడడముతోనే వాళ్ళు నవ్వు ఆపేశారు. గుమాస్తా వాళ్లని మందలించి నాకు క్షమాపణ చెప్పి తనూ నవ్వుకుంటూ పోయాడు. ఈ నవ్వు కంతకూ కారణం నా శాలువానేమో ననుకున్నాను.

అవశిష్టాలన్నీ తీర్చుకుని ఫలహరం చేస్తుండగా కుక్ వారి కంపెనీనుంచి, నాకు డబ్బు వచ్చిందని మనిషి వచ్చి చెప్పాడు. ఆ మాట వినడముతోనే ఎక్కడలేని సంతోషమూ వచ్చింది. వెళ్లి ఆ సొమ్ము తీసుకుని హోటలుకు వచ్చి ఆపూటే రైలుందని తెలుసుకుని త్వరగా సామాను సర్దుకుని కిందకు వచ్చాను. గుమాస్తా బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు మొత్తమెంతో ఇప్పుడు చెప్పదలచుకోలేదు. కాని అది వింటేమట్టుకు ఎంత జమీందారుకైనా ఒక్కసారి గుండె కొట్టుకోవడము మానేస్తుందని నానమ్మకము.