పుట:Baarishhtaru paarvatiisham.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని భార్య అని తోస్తుంది-చూడ్డానికి వచ్చారు. ఆ దొర ఆ అద్దాల్లో మరీగమ్మతుగా ఉన్నాడు. ఆ దొరసాని ఒకటే నవ్వడం. వాళ్లని చూస్తే నాకూ నవ్వు వచ్చింది. మేమిద్దరమూ నవ్వుతుంటే దొరకి ఉడుకుమోత్తనము వచ్చింది. అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను.

అక్కడి నుంచి నిమ్మళంగా హోటలుకి చేరుకున్నాము, నాతో ఉన్న దొర ఉదయాన్ని దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పి చక్కాపోయాడు. నేను నాగదికి వెళ్లాను. కాని ఆ దొర మర్యాద చూస్తేమట్టుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది. మన దేశము వస్తే వాళ్లు ఎంతటి వాళ్లనూ లక్ష్య పెట్టరు. ఇక్కడ వాళ్లంతా నన్నొక చిన్న జమీందారుని చూసినట్టు చూస్తున్నారు. దొరలచేత పనిచేయించుకుంటూ వాళ్లదగ్గరనుంచి సలాము లందుకుంటోంటే మహా సంతోషంగా ఉంది.

మధ్యాహ్నము అనుభవ మయింది, గనుక ఈపూట భోజనం నాగదికే తెప్పించుకు తిన్నాను.

ఇంక పడుకోడానికి చొక్కాలు విప్పి మామూలు మల్లు పంచ కట్టుకొని పడుకుంటే చలి ఆగేటట్టు లేదు. అందుకని సూటూ ఓవరుకోటూ తియ్యకుండా జోడుమట్టుకు విడిచేసి మంచము దగ్గిరికి వచ్చాను. ఆ పరుపుపైన ఉన్న పట్టు బొంత చూస్తే దానిమీద పడుకోబుద్ధి అయింది కాదు. బొంత ముద్దొస్తోంది. సరికొత్తదిగా కనబడుతోంది. అది నలిగి పోతుందంటే ఎంత మాత్రమూ మనసొప్పలేదు. నా బొంత తీసి కిందో సోఫామీదో వేసుకుని పడుకుందామా అనుకున్నాను. మళ్లీ ఇంత డబ్బూ ఇస్తూ కింద పడుకోవడము ఖర్మ మేమని మంచము మీదున్న