నిలబడ్డారు. నాతోటి వచ్చిన దొర నాకొకకొత్తసూటూ దుంగలాంటి ఓవరుకోటూ కొనిపెట్టాడు. అవి అక్కడే తొడుక్కున్నాను. ఇంటి దగ్గరనుంచి తెచ్చుకున్న సూటుకీ దీనికీ ఎంత తేడా ఉంది! ఇదివరకు నేను తొడుక్కున్న సూటుచూసి నవ్వారంటే ఆశ్చర్యమేముంది! ఇవి తొడుక్కుంటే చలిబాధకూడా చాలా తగ్గింది. బట్టలయితే బాగానే ఉన్నాయి. ఖరీదు చూస్తే మట్టుకు, ఇంత చూచినవాణ్ని నాకే ఆశ్చర్యమయింది.
అక్కడనుంచి నేనూ కుక్ వారి గుమాస్తా ఊరు చూద్దామని బయలు దేరాము. ఆ పట్టణ సౌందర్యమూ మేము చూసిన వింతలూ వర్ణించాలంటే భారతమంత గ్రంథమవుతుంది. నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకముగా వ్రాయదలుచు కొన్నాను. పైగా స్వీయచరిత్రలో వర్ణనాంశములు విశేషంగా ఉండకూడ దనుకొని అవేమీ ఇందులో వ్రాయడములేదు. కాని ఒక్క సంగతి మట్టుకు ఇక్కడ రాయ బుద్ధవుతోంది. మేము చూసిన వాట్లల్లోకల్లా గమ్మత్తుది అద్దాల మేడ ఒకటి. అందులో అన్నీ పెద్ద నిలువుటద్దాలు, అద్దాలంటే మామూలు అద్దాలు కాదు. మామూలు వయితే గమ్మత్తు ఏముంది? ఈ అద్దాల తమాషా ఏమిటంటే, ఒకద్దములో మనిషి మామూలుగా కనబడతాడు. ఒకదానిలో అసలుకంటే నాలుగురెట్లు ఎక్కువ లావుగా కనబడతాడు. ఒక దాంట్లో సన్నగా చిక్కి శల్యమైనట్లుంటాడు. ఒకదాంట్లో కంట్లో పాపలో కనపడ్డట్టె బుల్లి బొమ్మలా కనపడతాడు. ఇంకోదాంట్లో చూస్తే ఒక ఫర్లాంగు పొడుగున్నట్లు ఉంటాడు. ఇలా ఎన్నోరకాలు....
మా తోటి కూడా ఇంకో లావాటి దొరా ఒకసన్నని దొరసానీ-