పుట:Baarishhtaru paarvatiisham.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పుడేనా వాడి ధర్మమా అని చెప్పాడుగదా అని సంతోషించి, నా కృతజ్ఞత తెలియపరచడానికి నా మెడపట్టీ తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళెవళ్ళకైనా ఇచ్చుకోమని బహుమతిచేశాను. నాకు టిలిగ్రా మేమన్నా వచ్చిందా అంటే లేదన్నాడు. సరే పోనీ రేపు వస్తుందనుకున్నాను. చలి చాలా బాధిస్తూఉంది అన్నాను. ఓవరు కోటు కొనలేదా అన్నాడు గుమస్తా. లేదన్నాను. అయితే ఒకటి కొనుక్కోకపోతే చలికి సహించలేరు అన్నాడు. దయచేసి ఏదేనా బట్టలదుకాణం దగ్గిరికి తీసుకువెళ్లమని కోరాను. పాపం మంచి వాడూ కష్టసుఖాలు తెలిసినవాడూ పిల్లలు కలవాడూ (అనగా పిల్లలున్నట్టు వాడు చెప్పకపోయినా ఉండివుండా లనుకున్నాను) గనుక తక్షణం నా తోటి వచ్చాడు.

ఇద్దరం ఒక పెద్దషాపులోకి వెళ్ళాము. చాలా దర్జాగాఉంది షాపు; చెన్నపట్నంలో షాపుకిమల్లేనే ఉంది; అంతకంటే ఇంకా పెద్దదన్నమాట. దానికి నేలమీద చాలా చక్కని తివాసి ఉంది. చూసి దాని మీద నడవబుద్ధి అయింది కాదు. అందుకని దానిమీద నడవకుండా పక్కన నడుస్తే బాగుంటుందని వట్టినేలమీద అడుగుపెట్టాను. అదేమి నేలో కాని అడుగుపెట్టీ పెట్టడంలో జర్రున జారింది. పడకుండా గాలిని పట్టుకోవలెనని ప్రయత్నంచేసి చేతికిదొరకక పోవడము మూలాన్ని వెల్లకితలా పడ్డాను. పడడముతోటే అక్కడున్న గుమాస్తాలూ బంట్రోతులూ యావన్మందీ ఒక్కసారి ఫక్కున నవ్వారు. నా పక్కనున్న దొర నన్ను లేవతీసి దెబ్బ ఏమీ తగలలేదుకదా అని అడిగి తివాసీమీద నడుస్తే పడకుండా ఉంటానని సలహా చెప్పాడు. అదివరదాకా నవ్వుతున్న వాళ్ళంతా నేను లేచి వాళ్ళకేసి చూడడముతోనే నవ్వడము మానివేసి ఏమీ ఎరగనట్టు నాకేసి చూస్తూ