పుట:Baarishhtaru paarvatiisham.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవ్వడమే. ఏమిటా ఇలా నవ్వుతా రనుకుని నాబట్టలకేసి చూసుకుని ఈ ఏడురూపాయలన్నర సూటే కారణమై ఉంటుందిగదా అనుకుని తక్షణము కొత్తడ్రస్సు ఏదైనా కొనుక్కుందా మని నిశ్చయము చేసుకుని వీధిలోకి వచ్చాను. వీధిలోకి వచ్చేటప్పటికి చలి గజగజ లాడించేసింది. ప్లానలు సూటు అయినా చలి ఆపలేక పోయింది. ఇంత చలిగా ఉంది కదా అనుకుని మళ్లీ నా గదిలోకి వెళ్ళి పోర్టుసెడ్ లో కొన్న మెడపట్టీ తీసి చెవులకీ మెడకీ చుట్టుకుని దానిపైన దొరటోపీ పెట్టుకుని మళ్ళీ వీధిలోకి వచ్చాను. ఇదివరకు ఎవళ్ళయినా నన్ను చూస్తే కొంచెము చాటుగా నవ్వు కుంటుండే వాళ్ళు. ఇప్పుడు ప్రతివాళ్ళూ నా మొహము చూడడము ఫక్కున నవ్వడము చక్కాపోవడమున్నూ. వెడుతూంటే వెనకాలే పాతిక ముప్ఫైమంది కుర్రాళ్ళు ఈలలువేస్తూ నవ్వుతూ వెంబడించారు.

నా అదృష్టమువల్ల కుక్ వారి కంపెనీ హోటలుకు చాలా సమీపములోనే ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడి గుమస్తాలు విరగబడి నవ్వడము మొదలుపెట్టారు. నాకు ఉడుకుమోత్తనము వచ్చి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. ఎందుకలా నవ్వుతున్న రంతాను నన్నుచూసి? నాలో ఏమిలోపమో దయచేసి చెపుతే సవిరించుకుంటా నని దైన్యంగా వేడాను. వాళ్ళూ నన్ను చూసి జాలిపడి నా అవస్థ తెలుసుకుని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కుని చలిబాధ భరించలేక ధరించిన మెడపట్టీ ఆడవాళ్ళేకాని మొగవాళ్ళు వేసుకోవడము వాళ్ళ దేశాచారము కాదనీ, కొత్తగా ఉండడము మూలాన్ని నవ్వొచ్చిందనీ అందుకు క్షమించమనీ పొద్దున్న నన్ను హోటల్లో దిగ బెట్టిన గుమాస్తా అన్నాడు.

ఇందుకా బాబూ ఇంతగోలా అనుకుని ఇంకా అల్లరికాకుండా