మన వేపుకు మల్లెనే ఈతచెట్లూ అవీ వున్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. ఒంటెలు చాలా కనబడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా వుంది. దీపాలు పెట్టగానే మళ్ళీ నాగదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారే టప్పటికి పోర్టు సెడ్డు వచ్చామన్నారు.
మాగదిలో కుర్రాళ్ళు డ్రస్సు వేసుకుంటూ వున్నారు, నన్ను కూడా వూళ్లో కి వెళుదాము రమ్మని సంజ్ఞ చేశారు. సరే ఇక్కడ కూర్చుని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకొని కాస్సేపు తిరిగి వద్దామని నేనూ డ్రస్సు వేసుకుని బయలుదేరినాను.
ఆ వూరు బాగా పెద్దదే. చక్కని షాపులూ అవీ చాలా వున్నాయి. కాని అక్కడి సంగతులు చూస్తే దుర్మార్గము ఎక్కువవున్నట్టు తోచింది. అక్కడా ట్రాముకార్లున్నాయి. కాని విశేషము ఏమిటంటే వాటంతట అవి నడవలేవు. గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడ్డది. బజార్లంబడి తిరుగుతుండగా ఒక చోట ధామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనబడ్డది. అది చూసేటప్పటికి స్నేహితుణ్ణి చూచినట్టుగా వుంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమాస్తా నన్ను చూసి, ఏం కావాలన్నాడు. ఏమీ అక్కరలేదన్నాను.
'మరి అయితే ఎందుకు వచ్చావు?'
'నేను మీ పేసెంజరును.'
'ఏ మయితే?'
'ఏమీ లేదు. ఇక్కడ మీ కంపెనీ ఎలావుందో చూసి వెళదామని వచ్చా' నన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాటిటూ అటూ చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గిరలోనే