పుట:Baarishhtaru paarvatiisham.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంజ్ఞ చేశారు. కదలడానికైనా వోపిక లేకపోయి నప్పటికీ నెమ్మదిగా హాలులోకి వచ్చాను. అందర్నీ వరసగా నిలబడమన్నారు. ఒక డాక్టరు వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలచి కొంచెం పరీక్షచేసి పొమ్మనడం మొదలు పెట్టాడు. కొంతసేపయిన తరువాత మిస్టరు కొలంబో అని పిలిచాడు. నాపేరు వీళ్ళకు తెలియక డాక్టర్ తోటి కూడా యీ పేరే చెప్పారనుకొని స్కూల్లో అట్టెండెన్సు పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రెజంటు సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. డాక్టరు నిన్ను కాదన్నాడు. ఇంకొక యనభై సంవత్సరముల ముసలి దొర ముందరికి వచ్చాడు. ఆయన కాబోలు కొలంబో అనుకున్నాను.

డాక్టరు వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనము పెట్టే దొరను పిలిచి యేమిటీగోలంతా అని అడిగాను. వాడు స్టీమరు సూయజు దగ్గిరికి వచ్చిందనీ, ఇక్కడ వైద్యుడలా పరీక్ష చేయడము మామూలనీ, జబ్బుగా వున్న వాళ్లందరినీ ఇక్కడ దింపేస్తారనీ చెప్పాడు. సూయజు అంటే సూయజు కెనాలేమో అని అడిగినాను. ఇంకో పావుగంటకు, సూయజు కెనాల్లో ప్రవేశిస్తాము, కావలిస్తే పైకివెళ్ళి చూడవచ్చును, అని చెప్పాడు. నా గదిలో కుర్రవాణ్ని సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాపుమీదికి రావడము, చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికి ప్రాణంలేచి వచ్చినట్లుంది. దీపాలు పెట్టేవరకూ అక్కడే సూయజు కెనాలు చూస్తూ కూచున్నాను. చిన్నప్పుడు సూయజు కెనాలంటే ఏమిటో అనుకునే వాణ్ని. ఇదీ మామూలు పడవల కాలవగానే వుంది. ఎటొచ్చీ కొంచము వెడల్పూ లోతూ ఎక్కువ. ఒడ్డుని