పుట:Baarishhtaru paarvatiisham.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వరూ లేక పోవడమువల్లా, మామూలుగా వాళ్లు తినే తిండి తినక పోవడమువల్లా, వాళ్ళు తాగే కల్లు నేను తాగకపోవడమువల్లా, నాకూ లోపల ఏలాగో ఉండేది. తక్కినవాళ్లందరికీ కూడా నా అవస్థ చూసి జాలివేసిందని తోస్తుంది. ఎవళ్లో ఒకళ్లు అస్తమానం నాదగ్గిర కూర్చోడము, నాతోటి ఏదో మాట్లాడవలెనని ప్రయత్నించడమూ మొదలు పెట్టారు. ఈసారి బయలుదేరిన తరువాత నాకు వికారమూ తలనొప్పి ఎక్కువ అయింది భోజనముదగ్గిరకు వెళ్లడానికి కూడా ఓపికలేకపోయింది. నాగదిలోకే ఏ పాలో జావో తీసుకువచ్చి ఇస్తూండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి యేమీ నిద్రపట్టలేదు. తల బద్దలేస్తోంది, ఇంటిసంగతి జ్ఞాపకంవచ్చింది. కాస్త శొంఠి కొమ్మయినా లేకపోయింది గదా అనుకున్నాను. ఉంటేమట్టుకు మనకు గంధంతీసి ఇచ్చేవారెవరు? కళ్ళెంబడి నీళ్ళు వచ్చినవి. కళ్ళు తుడుచుకుని యెదురు గుండా చూచేటప్పటికి చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పేమన్నా తగ్గుతుందేమో ననుకున్నాను. అంత బాధతోనూలేచి ఆ టోపీ తీసి వుండకింద నలిపి కిటికీలోనుంచి అవతల పారవేశాను.

వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్రపట్టింది. తెల్ల వారింది. తలనొప్పి యేమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టుకూడా ఉంది. కిందటిరేవులోనుంచి స్టీమరు బయలు దేరిన మూడోరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు దొర వచ్చి అందరినీ డాక్టరు పరీక్ష చేయవలసి వుంటుందనీ, డ్రస్సు వేసుకుని సిద్ధంగా వుండమనీ చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం మూడుగంటలకి ఘంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని