పుట:Baarishhtaru paarvatiisham.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండూ చాలమంది దృష్టిని ఆకర్షించాయి. చాలా మంది అభిమానాన్ని పొందినాయి. కాని, నా సత్తా నాకు తెలుసు కనుక ఇకముందు మనమేమీ వ్రాయకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది అనుకుంటూండగా ఈ సమావేశం తటస్థమయింది. "బాలవాక్యం బ్రహ్మవాక్యం" అన్నారు పెద్దలు! మా కుర్రాళ్ళు అడగగానే ఎందుకో నాకూ వ్రాయవలెనని ఉత్సాహం కలిగింది. కాగితంమీద శ్రీరామ చుట్టి ప్రారంభించి, ఒక కుర్రవాడిని నర్సాపురం నుంచి నిడదవోలు దాకా తీసుకు వెళ్ళాను. అక్కడ వానిని ఏమి చెయ్యాలో తోచక మద్రాసుకు తీసుకు వెళ్ళాను. అప్పటికీ కుర్రవానికి నామకరణం చెయ్యలేదు. ఇంగ్లండు పంపిద్దామని అనుకోలేదు. ఆ వ్రాసినంత వరకూ మా కుర్రవాళ్ళకు చదివి వినిపించాను. వాళ్ళు చాలా బాగుందని ఏకగ్రీవంగా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ కుర్రవాళ్ళ సంతోషం నాకెంతో ఉత్సాహం కలిగించింది. ఈ కుర్రవాడు మద్రాసులో ఉండిపోయాడే, వాడిని మళ్ళీ ఇల్లు చేర్చవద్దా అనుకున్నాను. కథకు ఆది, మధ్య, అంతాలు సరిగా ఉంటేనే కాని నాకు తృప్తిగా ఉండదు. అందుచేతను ఆ కుర్రవాని సంగతి తేల్చక తప్పింది కాదు. అప్పుడు హఠాత్తుగా తోచింది- ఇలాటివాడిని దేశాంతరాలకు తీసుకువెడితే ఎలా ఉంటుందా