పుట:Baarishhtaru paarvatiisham.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏమి సంజ్ఞ చేశానో ఎలా వాండ్లకు తెలియ పరిచానో నా అవస్థ నాకే తెలియదు. పర్యవసానము మాత్రము ఒకడు తీసుకు వెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాలగదని కూడా చెప్పాడు. నేను అడక్కుండాను. స్నానము మాట దేవుడెరుగునని ముందు తొందరగా దొడ్లోకి పరుగెత్తి బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకి వచ్చి దంతధావనము చేసుకుని స్నానాల గదిలోకి వెళ్లి స్నానము చేశాను.

స్నానము చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధముగా అమర్చిపెట్టారు. అందరికీ కోడిగుడ్లూ, చేపలూ వడ్డించారు. నాకుమాత్ర మేదో జావా, రొట్టీ, వెన్నా ఇచ్చారు.

ప్రతిరోజూ ఇదే పద్ధతి, ప్రొద్దున్నే లేవడము, కాలకృత్యములు తీర్చుకోవటము, కాస్సేపు ఇటూ అటూ తిరగడమూ, మధ్యాహ్నము భోజనము, కాస్సేపు నిద్రపోవడమూ, టీ పుచ్చుకోవడము, ఎప్పుడు సాయంత్ర మవుతుందా అని కనిపెట్టుకు కూర్చోవడము, భోజనము చేయడము పడుకోవడము--ఇదీ కార్యక్రమము. నాల్గు దినాలు ఇలా గడచినవి. ఓడ అస్తమానమూ ఊగిసలాడడమువల్లనో, భోజనము తిన్నగా లేకపోవడము వల్లనో నాకెప్పుడూ వికారముగానూ తల నొప్పిగానూ ఉండేది. అన్న హితవు బొత్తిగా తప్పిపోయింది. అన్నహితవంటే రొట్టె హితవని అర్ధము. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నము కళ్ళ బడలేదు.

ఇలా నాలుగు రోజులు గడిచినవి. అయిదో రోజు ఉదయము అహర్నిశాదులూ పరిగెడుతున్న స్టీమ రాగి పోయింది. ఎందు చేతనా అని కిటికీలోనుంచి తొంగిచూచేసరికి ఊరు కనిపించింది.