పుట:Baarishhtaru paarvatiisham.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్టీమరు వాళ్లే పరుపులూ అవీ వేసి వుంచడము మూలాన్ని నా మంచమూ బొంతా తీయవలసిన అవసరము లేకపోయింది. ఆ పరుపుమీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రములో స్టీమరుకు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెళుకవవచ్చింది. లఘుశంకకు వెళ్లవలసిన అనుమానంగావున్నది. ఎక్కడికి వెళ్లడానికీ తోచలేదు. ఎవళ్లను అడుగుదామన్నా ఎవళ్ళూ కనపడరు. నా గదిలో కుర్రాళ్ళను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్ళకు తెలియదు. ఏం చెయ్యడానికీ తోచలేదు. అలాగే బలవంతాన బిగబట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. నిమిష మొక యుగముగా వుంది.

ఎలాగైతే నేమి తెల్లవారింది. లేచి హాలులోకి వచ్చాను. అక్కడున్న ఒక దొరదగ్గిరికి వెళ్లి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీషున అడిగాను. వాడి కర్ధము కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా నలుగురైదుగురిని అడిగి చూశాను. ఎవళ్లూ నన్ను గ్రహించుకో లేక పోయారు. నా బాధ చెప్ప శక్యము గాకుండా ఉంది. ఇంకో క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోని భయము వేసింది. పోనీ సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగూ సంజ్ఞ చేయడము? సంజ్ఞ చేయడానికి మట్టుకు వాళ్ళకు ఏ సంజ్ఞ చేస్తే తెలుస్తుందో? అక్కడికే మన దేశాచారాన్ని బట్టి ఒక వేలు చూపించాను. ఎవళ్ళకూ తెలియలేదు. రెండు వేళ్లూ చూపించాను. దానికీ సమాధానము రాలేదు. వాళ్ళ దేశములో మూడువేళ్లు చూపిస్తారేమో ననుకుని మూడు వేళ్లూ చూపించాను. అదీ అర్ధము చేసు కోలేదు. ఒళ్లు మండి ఐదువేళ్లూ చూపించాను. అదీ లాభించలేదు. ఆఖరుకు