పుట:Baarishhtaru paarvatiisham.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తింటారనుకున్నాను. వీళ్ళు అన్నము లేకుండా వట్టిమాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నాదగ్గిరికి వచ్చాడు. నాకక్కరలేదన్నాను. వాడాశ్చర్యపోయి నాకేసి చూశాడు. ఏదో అన్నాడు. నాకర్థముకాలేదు. ఏమిటా దిక్కు మాలినభాష, స్వచ్ఛమైన ఇంగ్లీషులో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెపితే నేమి గోడకు చెపితేనేమి? నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా!

ఇంక మనకర్మము విశ్వస్తలాగ అర్థరాత్రివేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ వుంటే వాడు కూచోమని సంజ్ఞ చేసి వెళ్ళి యింకో దొరను తీసుకువచ్చాడు. ఆ వచ్చినాయనా ఏదోభాషలో మాట్లాడడము మొదలు పెట్టాడు. నాకు కోపము వచ్చింది. మొదటివాడివంక చూచి యీ అఘోరానికి వాణ్ణికూడా తీసుకు వచ్చావెందుకు? నీ వఘోరించావుకాదా అన్నాను తెలుగున. అవును, వాడి కర్థము కానప్పుడు ఏభాషైతే నేమి, తెలుగైతేనేం? కొత్తగా వచ్చినవాడికి ఒకముక్కో ముక్కన్నరో యింగ్లీషు వచ్చునని తోస్తుంది. సంజ్ఞలవల్ల నైతేనేమి, వాడికీ నాకూ అర్థము కాని యింగ్లీషు భాష వల్ల నైతేనేమి, భోజనము చెయ్యవా? అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏం అన్నాడు. నేను మాంసము తినను అన్నాను. అనేటప్పటికి నా అవస్థవాడు గ్రహించుకుని కూర్చొమని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకు వెళ్ళీ చక్కగా కాల్చిన కల్లురొట్టెలు రొండూ మరికాస్త వెన్న, కాసిని వుడకేసిన బంగాళా దుంపలు పంపించాడు. కడుపునిండడానికి కేదైతేనేమి, అవే తిన్నాను. అది పూర్తి అయ్యేటప్పటికి అందరికీకూడా సగ్గుబియ్యము క్షీరాన్నము తీసుకువచ్చాడు. సరే యిదీ బాగుందనుకుని, నాకిష్టము కూడా నేమో, మరికాస్త పుచ్చుకున్నాను. రోజూ యిలా వుంటే చాలు ననుకున్నాను. నలుగురితోటి పాటూ లేచి నా గదిలోకి వచ్చాను.