పుట:Baarishhtaru paarvatiisham.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అది చూసేసరికి కొంత ధైర్యము వచ్చింది. సరే మనకు స్వహస్తపాకము తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామగ్రి పెట్టెలో పెట్టి నేనూ పంక్తి భోజనానికి తయారయ్యాను.

మొత్తము ముప్ఫై నలభై మంది దొరలున్నారు. పది పదిహేనుగురు దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడము ఆరంభించారు. వాళ్లు ఏభాష మాట్లాడుతున్నదీ నాకు తెలియలేదు. ఫ్రెంచి స్టీమరన్నారు గనుక ఫ్రెంచేమో ననుకున్నాను. అంతా నన్నూ నా వేషమూ చూసి లోపలేమనుకున్నారో కాని వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానము చెప్పాను, వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిమొగాలు వేసుకుని నా కేసిచూశారు పోనీ తెనుగున చెపుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహము ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుందనుకున్నాను. ఇక లాభము లేదనుకుని వాళ్ల ధోరణ్ణి వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకుమట్టుకు కొంచెము భయము వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు, మనతోటి మాట్లాడే వాళ్లయినా ఎవళ్లూ ఉండరు కాబోలు, కాలము ఎలా గడుస్తుందా అనుకున్నాను.

ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతివాళ్ళదగ్గిరికీ తీసుకురావడము, ఎవళ్ళకు కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్లు వాళ్ళ కంచాల్లో పెట్టుకొనడము.

తెచ్చిన పదార్ధము దాని ఆకారమువల్లా వాసనవల్లా బ్రాహ్మణులు ముట్టుకో తగ్గది కాదనుకున్నాను. మనదేశములో మాంసము తినేవాళ్ళయినా, కూరల్లే వండుకుని అన్నములో వేసుకొని