పుట:Baarishhtaru paarvatiisham.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాను సవిరించుకుంటున్నారు. నేనూ నాపెట్టీ అదీ మంచము కిందికి తోసివేసి సముద్రము కేసి చూస్తూ కూచున్నాను.

చీకటి పడ్డది. గదిలో మొన్నటిస్టీమరులో మల్లేనే ఎలక్ ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా వుండడము మూలాన్ని విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గిరనుంచి తెచ్చిన మల్లుపంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూచున్నాను. పై కుర్రాళ్లిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం?

ఇంక రాత్రి భోజనము సంగతేమిటా అనుకున్నాను. భోజనము స్టీమరు వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనము పెడతారో ఎంత పుచ్చుకుంటారో, కంపెనీ వాళ్లను అడగడము మరచి పోయాను. మొన్నరాత్రి స్టీమరు వాళ్లు నా దగ్గిరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్లడగడమే మరిచిపోయారో, లేకపోతే పాపము ఏమీ తినలేదనే విడిచిపెట్టారో, ఏ సంగతీ దిగిరావడము హడావిడిలో అడగడము మరిచిపోయాను. ఇంతకూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొన్న గోధుమపిండి మరపొయ్యీ వగైరా వున్నాయి కదా రొట్టెలు చేసుకుందాము అని పెట్టెతీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతటిలోకే ఒక గంట వినబడ్డది. పైనున్న కుర్రవాళ్లిద్దరూ కిందకు దిగి నన్ను కూడా రమ్మన్నారు. రమ్మన్నారేమోనని వాళ్ల సంజ్ఞలవల్ల నేను గ్రహించాను. వాళ్లు మాట్లాడిన భాషేమిటో నా కర్థము కాలేదు. ఎక్కడో చూద్దామని వాళ్లతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాలులో బల్లమీద తెల్లని గుడ్డపరచి మామూలు పింగాణీపళ్లాలూ, కత్తులూ, కఠార్లూ అన్నీ అమర్చి వున్నవి.