పుట:Baarishhtaru paarvatiisham.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని పుట్టుపూర్వోత్తరాలు ఏమి చెప్పను, అతను చెప్పుకున్న కంటె? అతను అయోనిజుడు-స్వయంభువు. బ్రహ్మమానస పుత్రుల జాతిలోని వాడు.

పార్వతీశం తన నివాసం మొగల్తుర్రు అని వ్రాసుకున్నా, యదార్థం చేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలుకా గుమ్మలూరు అనే గ్రామం. మనలో మనమాట, అది మా అత్తవారి ఊరు. అందుచేతనే నాకా ఊరుమీద అభిమానం ఎక్కువ. ఒక సారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మామూలులాగ నా బావ మరదలూ, మరదళ్ళూ, పక్కింటి వారి అబ్బాయి మొదలైన వాళ్ళంతా నా చుట్టూ చేరారు. ఆ కబురూ ఈ కబురూ చెప్పడంలో ఒక పడవప్రయాణంలో ఉండే కష్టాలూ, తమాషాలూ, చెప్పుకొచ్చాను. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళంతా నన్ను ఏకగ్రీవంగా అదో కథలా వ్రాయమన్నారు. నాకప్పటికి పుస్తకం వ్రాద్దామనే సంకల్పం ఎంత మాత్రమూ లేదు. నేను అప్పటికి వ్రాసినదల్లా మూడు కథలు మాత్రమే. 'పిలక ', 'నేనూ మా ఆవిడా ' అనేవి 'సాహితి' లోనూ, 'లక్ష్మి ' భారతి పత్రికలోనూ తరువాత అచ్చుపడ్డాయి. సాహిత్య రంగంలో అతి చౌకగా ఖ్యాతి సంపాదించిన వాళ్ళలో అగ్రగణ్యుడను నేను. పిలక-లక్ష్మి అనేవి