Jump to content

పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆత్మవిచారము, ఉత్తరభాగము

[1 వ

నిత్యానిత్యవస్తువివేకమును మనము సంపూర్ణముగా నెరుగవలసినది ముఖ్యము. ఆత్మవిచారము, పూర్వభాగము, పుట 47 నందు ఆదిపురుషునికి ప్రజ్ఞానాంశువు లేక తురీయుడు లేక తురీయాత్మ యని పేళ్లు వాడుకలోకి తేబడియున్నవి. తురీయాత్మయొక్క ప్రతిబింబమునకు ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞాత్మ, ఆత్మబుద్ధిమనస్కుడు అను పేళ్లువాడబడియె. తురీయాత్మను ఉద్దేశించి చూచునెడల తురీయాత్మ సత్యం, ప్రాజ్ఞాత్మ మిథ్య, ఇది ఒక మెట్టు. రెండవది ప్రాజ్ఞాత్మ ప్రతిబింబించెననియు ఆ ప్రతిబింబమునకు తైజసవైశ్వానరు డని పేరు అనియు చెప్పబడియె. ఈ విషయమే ఉత్తరోత్తర సందర్భములయందు అనేక తడవలు వివరింపబడి యున్నది.

ప్రాజ్ఞాత్మ సత్యం అని యుద్దేశించి తైజసవైశ్వానరుని చింతించిన యెడల తైజసవైశ్వానరుడు ప్రతిబింబమైనందున మిథ్య. తైజసవైశ్వానరాత్మ యను రెండవ ప్రతిబింబము స్వర్గము మొదలు భూలోకస్థూలభాగ మంతటయు వ్యవహరించగల దనియు వ్రాయబడియె. ఇట్టి వ్యవహారార్థముగా స్థూలశరీర మొక్కటి, ఆస్ట్రలుబాడి యొకటి, అశుద్ధమానసశరీరము ఒకటి వెరసి మూడు శరీరముల నుపయోగించుచుండును అని చెప్పబడియె. ఈ శరీరములకు దేహములు అని పేరు. దేహములను ఉపయోగించువానికి దేహి యని పేరు. దేహిని యుద్దేశించి దేహములు అసత్యములు. "దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్య భారత," అని శ్రీమద్భగవద్గీతయందు చెప్పబడియున్నది. నిత్యానిత్యవస్తు వివేకమునందు దేహి నిత్యుడనియు దేహములు అనిత్యములనియు నిశ్చయముగా తెలిసికొనుట ముఖ్యము.