Jump to content

పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 1]

సాధనచతుష్టయము

15

నియమించవలయును. తాను తలంచు తలంపులు సత్యములుగా నుండవలయును. తాను ఇతరులయందు పడు అభిప్రాయములు సత్యములైన వాక్కులను అనుసరించి యేర్పడిన అభిప్రాయములు గానుండవలెను. అదేవిధమున వాక్కునందుకూడ సత్యమునే యభ్యసించవలయును. ఇతరులు తప్పునడత నడిచినారని వినినయెడల ఆ వినికిడిని ఇతరులతో చెప్పకూడదు. ఏలనంటే అది నిజమో అబద్ధమో తెలియదు. ఒకవేళ నిజముగానే యుండెనను కొందము. అప్పటికైనను దయాస్వభావమును వృద్ధిపరుచుకోవలె నని ప్రయత్నము చేయుచున్న ఉపాసకుడు తాను వినిన దూషణమాటలను ఇతరులతో చెప్పకూడదు. అధికముగా మాటలాడవలె నని వాగింద్రియము ప్రేరేపించుట సహజము. అయింద్రియమును దండించు నుద్దేశముతో నైనను వాఙ్నయమమును అభ్యసించవలయును. ఇదే విధమున ఉపాసకుడుచేయు కార్యములలో కూడ నిత్యానిత్యవస్తువివేకము నుపయోగించవలయును. మనోవాక్కాయములను దండించి స్వాధీనపరుచుకొనుట ఉపాసకునికి విధేయము.

లోకులలో నొక వాడుక కలదు. ఎవడో చేసిన సత్కార్యమును తాను చేసినట్టును తాను చేసిన దుష్కార్యమును మరియొకనియందు ఆరోపించుటయు సహజము. నివృత్తిమార్గయాత్రా పరుడు ఈలాటి మోసమునకు లోబడకూడదు.

ఈ విధమున బహుప్రకారములుగా తనను తాను సవరించుకొను నభిప్రాయముతో ఉపాసకుడు నిత్యానిత్యవస్తువివేకమును అనుష్ఠించుచురావలయును.