పుట:Atibalya vivaham.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

అతిబాల్యవివాహము

సంసారసుఖమునకు పనికిరాక యొండొరులకు దు:ఖహేతువు లగు చున్నారు. కొన్ని సమయములయందు యోగ్యు లయిన పురుషుల కయోగ్యురాండ్రు భార్యలగుట లభించియు, గుణవంతురాండ్రయిన స్త్రీలకు గుణహీనులు భర్తలగుట లభించియు, పరస్పరాంగీకారము లేక పోవుటచేత మనసు కలియకయు, భర్తకంటె ముందుగా భార్యయెదిగి కాపురమునకు వచ్చియు, దంపతులలో నొకరు విద్యావంతులయిన నొకరు మూర్ఖశిరోమణులుగా నుండఁదటస్థించియు, బహు దంపతు లేకగృహమున వసించుచుండియు సుఖ మన్నమాట యెఱుఁగనివా రగుచున్నారు. పెద్దపెరిగినతరువాతఁగాని సుగుణములో దుర్గుణములో తిన్నగా స్థిరపడవు గనుక చిన్నతనములో వివాహము నాటికి మంచి వారనుకొన్నవారే కొందఱు తరువాత చెడ్డవారయి మరికొన్ని దాంపత్యములు దు:ఖదాయకము లగుచున్నవి. బాల్య వివాహ ప్రభావముచేత జనకులన్నపేరు చెఱుప నవతరించిన మనుష్యరూపముననున్న ఘోరరాక్షసులు ధనాశాపాశబద్ధులై తమ ముద్దుబాలికలను వృద్ధవిగ్రహములకును వారికంటెను అధములయిన రోగిష్టులు మొదలయినవారికిని విక్రయించుచుండుటవలన ఆముద్దాండ్రీడేరి కాపురమునకు వచ్చునప్పటికి పతులు స్వర్గయాత్ర కున్ముఖులై యుండియు జీవచ్ఛవమువలె నుండియు యువతులు పలువురు దు:ఖములపాలు కావలసిననవా రగుచున్నారు. ఇంతేగాక మనదేశములో నున్నయనేకవర్ణ భేదములచేతను వానిలోని మితిమీఱిన శాఖోపశాఖల చేతను తల్లిదండ్రులు వేఱుగతి లేక రంభవంటికొమార్తెనైనను కొన్ని సమయములయందు వికలాంగున కయినను దరిద్రున కయునను ఇచ్చి వివాహము చేయవలసినవా రగుటచేత కొందఱుకన్నియలు సుఖ మెఱఁగనివా రగుచున్నారు.

ఇట్టి వేమియులేక సుఖ మనుభవింపుచున్నా రనుకొనుచున్న