పుట:Atibalya vivaham.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిబాల్యవివాహము


ఓవిద్వన్మహాజనులారా!

ఈసమాజముయొక్క అగ్రాసనాధిపతిగారు కొన్నిదినముల క్రిందట నన్నొకయుపన్యాసము చదువు మని యడిగినప్పుడు నాశక్తిని వక్తవ్యాంశముయొక్క గౌరవమును లేశమాత్రమును విచారింపక సాహసము చేసి బాల్యవిహమునుగూర్చి యుపన్యసించుట కొప్పుకొన్నాఁడను. కాని యీదినమున నేను కలము చేతఁబట్టుకొనివ్రాయ నారంభింపఁగానే, నాకంటె సమర్థతరులకు విడిచిపెట్టెవలసిన కార్యభారమును,నేను పైని వేసికొన్న హేతువుచేతగాఁబోలును కలము సాగక నాచేయి నడఁక మొదలు పెట్టెను.నాకంటె విద్యయందును బుద్థియందును అధికులయిన యీసామాజికులలో మఱియెవ్వరయిన సమర్థు లీబాల్యవివాహమును గూర్చి వ్రాసినచో మిక్కిలి రసవంతముగాను జనరంజకముగాను ఉండునని నేనెఱిఁగినవాఁడ నయ్యును, రోటిలో తల దూర్చినతరువాత రోకటిపోటునకు వెఱవఁదగ దన్నసామెతను స్మరించుకొని నాకు తోఁచినది వ్రాయ తెగించుచున్నాను. కాఁబట్టి నేనిప్పుడు చెప్పఁబోవుదానిలో మీ రెఱుఁగని క్రొత్తసంగతులుగాని క్రొత్తయుక్తులుగానియుండునని యాశపెట్టుకొనఁ బోకుడు. లోకములోననుభవింపఁదగిన సమస్త సుఖములలోను వివాహబంధమువల ననేభార్య, భర్త,తండ్రి, బిడ్డ,అక్క,చెల్లెలు,అన్న,తమ్ముడు,మొదలయిన సమస్త బంధుత్వములునుకలుగుననియు, ఈవివాహబంధము వలననే బిడ్డలు మృగప్రాయులుగాక తగినసంరక్షణమును విద్యాబుద్థులను పొంది వెలయుదు రనియు,ఈవివాహబంధమువలనే స్త్రీ పురుషులు యావజ్జీవమును స్నేహపాశాబద్థులయి యుండి యిరువురు నొక్క