పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 5

పెళ్లిఅడి సుఖపడుతూవున్నప్పుడు నవుకర్లు పెళ్లి ఆడితేమాత్రం యెందుకు కోపంవుంటుంది?

కర -- నిన్నుచూస్తే అతడు తప్పకుండా సంతోషిస్తాడు. అతడికి పెళ్ళిమాత్రమే యిష్టంలేదుగాని నీవంటి పడుచు పెళ్ళి కూతుళ్ళంటే చాలాయిష్టమే.

మోహి -- అలాగయితే యింకా యెన్నాళ్ళు నేను యీ రహస్యం దాచవలెను.

కర -- యెన్నాళ్ళో అక్కరలేదు. నేను ఈయనదగ్గిర నవుకరీ వదులుకున్న దాకా దాస్తేచాలును. నాకిప్పుడు ముప్ఫయియేళ్ళు వున్నవి. ముసలవాణ్ని అయినతరువాత నేను నవుకరీ తక్షణం మానుకుంటాను. నేను నవుకరీ మానుకున్నదాకా దాచలేకపోతే నాయజమానుడు ముసలవాడయిన దాకానయినా దాచు. అంతే చాలును. అతఁడు నాకంటె నాలుగేళ్ళుమాత్రం చిన్నవాఁడు. నీవలాచేస్తే నాకు యితఁడు డబ్బు చాలా యిస్తాడుగనుక నేను యెప్పుడూ నవుకరీవదలుకోకుండా సుఖంగా వుంటాను.

మోహి -- నీవు నవుకరీ వదులుకున్నదాకానే రహస్యం దాచుతానుగాని అతఁడు ముసలివాడైనదాకా నేను దాచలేను. ఈలోగా యేలాగయినా కష్టపడుతానుగాని నాకోసం నీవు రేపు వుదయాన్నుంచీ తప్పకుండా నవుకరీ మానుకుందూ

కర -- నవుకరీ మానుకుంటే నీకు నగలూ బువ్వ యెక్కడ నుంచి వస్తుంది?

మోహి -- ఆలాగయితే నీవు డబ్బు బాగా సంపాదించి పరుపులూ పట్టెమంచాలూ చేయించి నాకు నవుకర్లనూ పెట్టి బండిలో యెక్కించి నన్ను వూరంతా తిప్పి సుఖపెడుతావా?