పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 3

రామా -- నేను వేగిరం వెళ్ళవలెనని నీకు బహుతొందరగా వున్నది యెందుచేత?

కర -- నాకుయేమీ తొందరలేదు. కావలిస్తే వెయ్యేళ్ళు యింట్లోనేవుండండి. వకరోజయినా వూరు దాటిపోతే చాలునని సంతోషించడానికి నాకు పెళ్ళామయినా వున్నదాయేమిటి?

రామా -- ఆహాహాహా. పెళ్ళాలువున్న వాళ్ళందరికీ నేను వెళ్ళిపోవలెనని వుంటుందేమి? నేను యిప్పుడు వ్యభిచారంమానివేసి పెద్దమనిషి నవుతూవున్నాను. మీదటినుంచి బొత్తిగా మానివేస్తాను. నేను వాసుదేవరావు పెళ్ళాము జానికమ్మనువిడిచి వక్కనిముషం తాళలేను. ఆవిడె కేవలమూ జానకీదేవే. నాపాలిటి శ్రీమహాలక్ష్మి. నీమాట తీసివెయ్యరాదు. నేనుకూడా ఆస్టీమరులోనే వెళుతాను. నేను వెళుతూవున్నాను. ఇల్లు పదిలము. మీఅమ్మగారు తానువచ్చేలోగా మంచిదాసిని కుదుర్చుమని చెప్పిపోయింది. ఆమాటమరచిపోకు. ఇవిగో యింటితాళము చెవులు. రేపు ఆదివారంగనుక నేను రావడం రెండురోజులు ఆలస్యమయినా యీలోపుగా అమ్మగారు ధవిళేశ్వరంనుంచివస్తే తాళంచెవులియ్యి. (అని వెళ్ళుచున్నాఁడు)

కర -- ఈయనను వదల్చుకున్నాను. ఇఖ నాపెళ్ళాం యిక్కడకు స్వేచ్ఛగా రావచ్చును. వచ్చేటప్పుడుమాత్రం నాపెళ్ళాము దోవలో యీయనకంట పడకుండా రావలెను. ఆలావస్తే ఈరాత్రి మాప్రభువుగారి పడకగదిలో పందిరి పట్టెమంచంమీద మా మోహినీ నేనూ రాజదంపతులలాగు వుంటాము. అదుగో మోహిని వస్తూవున్నది.

[అప్పుడు మోహిని ప్రవేశించుచున్నది.]

మోహి -- కరటకరెడ్డీ! నీయజమానుఁడు వూరికివెళ్ళినాఁడా!