పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 28

అనేకులు పేరుకు గృహస్థులమని నటిస్తూవున్నా మీదయవల్ల సంసార సుఖంలేకుండా నిజమయిన బ్రహ్మచారులుగానే వున్నారు. ఆసంగతి దేవరవారికే విశదము.

రామా -- ఆసంగతి నీవుచెప్పనక్కరలేదు. నీవుదీన్ని పెళ్లాడినమాట నిజమేనా!

కర -- నిజమే. ముమ్మాటికీ నిజమే.

రామా -- అన్నీ అబద్ధాలాడేవాడవు. నీవుయిందులోమాత్రం నిజంచెప్పివుంటావా?

కర -- యీ వేళనేను నిజంచెప్పడానికి ఆరంభంచేసినాను. దేవరవారు నేను యిఖగృహస్థ బ్రహ్మచారినిగా వుండవలసిన ఆవశ్యకంలేకుండాచేస్తే నేను నేటినుంచి సత్యహరిశ్చంద్రుణ్ని అవుతాను.

రామా -- కరటకా! ఇందాకటి నీఅవస్థతలుచుకుంటే నాకు నవ్వువస్తూవున్నది. ఇప్పుడు జరిగినదంతా మఱిచిపోయి మీరు యిద్దరూ యిఖమాయింట్లో సుఖముగా వుండవచ్చును. నేను యిఖముందు నీవుచెప్పిన గృహస్థబ్రచారులను నిజమైన గృహస్థులనుగా చెయ్యడానికే ప్రయత్నంచేస్తాను. లోపలికిపోదామురండి.

కర -- అలాగయితే మాకు యిదివరకు జరిగినవివాహం వివాహంకాదు. ఇప్పుడు మీరు జరిగించినదే వివాహము. నాబ్రహ్మచర్యంవదలి మీదయవల్ల నేను యిప్పుడు నిజమయిన గృహస్థు నవుతూవున్నాను.

[ అందఱు నిష్క్రమించుచున్నారు.]