పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 25

[శ్యామలాంబ ప్రవేశించుచున్నది.]

శ్యామ -- ఏమిటి? మీలోమీ రప్పుడే తగువులాడుతూ వున్నారా?

కర -- అమ్మా! తప్పితందానిదికాని నాదికాదు.

మోహి -- అమ్మా! తప్పితమంతా ఇతనిదే. నేను తనకు ముద్దియ్యబోతే పుచ్చుకున్నాఁడుకాఁడు.

శ్యామ -- యేమిటి? పెళ్ళాముప్రేమతో ముద్దుయిస్తే పుచ్చుకున్నావు కావా? ఏదీ యిప్పుడు నాయెదుట ముద్దుపెట్టుకో.

కర -- (తలుపుకేసి చూచి) యిఖనాతప్పితంలేదు. (అని ముద్దుపెట్టుకొని) మోహినీ! జరిగిపోయినది మరచిపో. యిఖనేను నీవుచెప్పినట్టు వింటాను.

రామా -- (తలుపు తీసికొనివచ్చి కోపముతో) నేను యింత దూరము చెప్పినా నిర్భయంగా నీవుమళ్ళీ ముద్దుపెట్టుకున్నవుగా!

మోహి -- అయ్యా! నా పెనిమిటిమీద కోపపడకండి.

రామా -- (తనలో) పెనిమిటా? ఇదికూడా హాస్యానికన్న మాటే నిజంచేస్తూవున్నదే. (ప్రకాశముగా) నేను యిప్పుడు వీడిపని తీసివేస్తాను.

శ్యామ -- మీరు నిష్కారణంగా పనితీసివెయ్యకూడదు.

రామా -- నిష్కారణంగా కాదు. కావలసినంత కారణం వున్నది. ఆ కారణమేమో రెడ్డికే తెలుసును.

కర -- నాకా? నాకుయేకారణమూ తెలియదు.

రామా -- నీకు కారణమేమీ తెలియదుగా?

శ్యామ -- రెడ్డీ! నీవు మారుమాటయేమి చెప్పవద్దు. మీ దంపతులు యిద్దరూ దంపుళ్ళగదిలోకిపొండి. నేను తరువాత ఈయనను సమాధానం చేస్తాను.