పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 23

రామా -- యెందుకు పెట్టుకున్నావు?

కర -- మీకోసమే ముద్దుపెట్టుకున్నాను. అమ్మగారి మనస్సులో మీయందుండే అనుమానంపోగొట్టడానికి నేనాపనిచేసినాను. నేనుచేసినపని మీక్షేమంనిమిత్తమే కాని నానిమిత్తంకాదు. సేవకులు యజమానుల నిమిత్తమయి యెంతపనిచేసినా వారికి మెప్పు కనుపడదు.

రామా -- ఆముద్దు నాకోసంకాకుండా నీకోసమే పెట్టుకున్నావని నాకుయిప్పటికీ అనుమానము బాధిస్తూనేవున్నది. అదుగో మోహిని యిలాగేవస్తూవున్నది. నేను లోపలికిపోయి యీతలుపు కంతలోనుంచి మీయిద్దరిచర్యలూ కనిపెడుతూవుంటాను. నీవునన్ను మోసం చెయ్యలేవు.

కర -- అయ్యా! మోహిని వకవేళవచ్చి మోహించి నన్ను యేమయినాచేస్తే, అదీ నాతప్పితమేనా? ఆడవాళ్ళువచ్చి యెదుట నిలవబడ్డప్పుడు మగవాళ్ళు మనసుపట్ట లెరు. మీవిషయంలో నాశాయశక్తులా పనిచేస్తానుగాని వకవేళ ఆచిన్నది తనంతటవచ్చి నన్ను-

రామా -- దానికి ఫర్వాలేదు. నీవుమాత్రం మళ్ళీయెప్పుడూ ముద్దు పెట్టుకోకూడదు. యీసారి నీవు మళ్ళీ ముద్దుపెట్టుకున్నట్టయితే నిన్ను గుర్రపుకొరడాతో చావగొట్టి మాయింట్లోనుంచి సాగనంపుతాను. (అని లోపలికిపోయి తొంగిచూచుచున్నాఁడు.)

[మోహిని ప్రవేశించుచున్నది.]

మోహి -- ఆమె బహుదొడ్డయిల్లాలు. యికమనరహస్యం మానివేసి మనంయిక్కడ సుఖంగావుండవచ్చును.

కర -- మెల్లిగామాట్లాడు? మెల్లిగా. (తనలో) ఇదియెంత సౌంజ్ఞచేసి చెప్పినా మెల్లిగా మాట్లాడకుండావున్నది. నేనుజవాబు చెపితే నాపనిపోతుంది. చెప్పకుండావుంటే పెళ్ళాముపోతుంది. నాకంతా అసాధ్యంగానేవున్నది.