పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 22

కర -- (శ్యామలాంబకు వినఁబడునట్లు బిగ్గరగా) క్షమించండి. నాభార్యతో-

రామా -- (మెల్లగా) నీభార్యా?

కర -- అవును నాభార్యా. అమ్మగారుదాన్ని తమపనికత్తెగా వుంచుకోవడానికి వప్పుకున్నారుగనుక, ఆమెవద్ద యేలాగునడుచుకోవలెనో దానికి బుద్ధిచెపుతూవున్నాను. మీరు యెరుగుదురు గదాండి-

రామా -- నీవు వట్టి ఝూటాకోరువని నేను యెరుగుదును. ఇలాగంటి పనులు చెయ్యకుండా నిన్ను గుర్రపుకొరడాతో వీపుబద్దలు కొట్టవలెను.

కర -- ఈపరియాచకం బాగానేవున్నది.

రామా -- బాగానేవుంటుంది. తెలివితక్కువదాన్ని చేసి నీవా చిన్నదాన్ని చెరపడానికి చూస్తూవున్నావు. మాయింట్లో యిటువంటి నీతిమాలినపనులు యెంతమాత్రమూ పనికిరావు.

కర -- దైవముతోడు! నిజముగ అది-

రామా -- నావద్ద నీఅబద్ధపు ప్రమాణాలూ గిమాణాలూ సాగవు. నీవాచిన్నదాన్ని యెందుకు ముద్దుపెట్టుకున్నావో చెప్పు.

కర -- (తనలో) యెవరూ లేనప్పుడు నేను రహస్యంగా ముద్దు పెట్టుకున్న సంగతి యితనితో యెవరు చెప్పినారో. ఓయి దేవుడా? ఇక్కడ గోడలకుకూడా చెవులు వున్నవికదా?

రామా -- నీవుమళ్లీ యేదో పెద్ద అబద్ధమాడడాని కాలోచిస్తూ వున్నావు.. నీమాటలకు నేను మోసపోను.

కర -- నేను అబద్ధం యెంతమాత్రమూ ఆడను, నిజంగా నేను మోహినిని ముద్దుపెట్టుకున్నాను. మీరు నమ్మినాసరే నమ్మక పోయినాసరే నిజంచెప్పినాను.