పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 21

యెంతో చక్కగా మాటాడినది. దానికపటం లేని మాటలువింటే నాకు బహుసంతోషమయినది.

రామా -- అది నీమనసుకు నచ్చినదిగద?

శ్యామ -- చివరకు నాకుమంచిదాసీ దొరికింది. మనరెడ్డి దానిమీద ప్రాణములు విడుస్తూవున్నాఁడు. మొగుడూ పెళ్ళామూ యిద్దరూ మనయిల్లు కనిపెట్టుకువుంటారు. వాళ్ళ అనురాగమూ ఐకమత్యమూ చూస్తే నాకు ముచ్చటవుతూవున్నది.

రామా -- (తనలో) వాడు యెంతసేపటికీ కదలిరాకుండా వున్నాడు. దొడ్లో దానితో యేమిచేస్తున్నాఁడు?

శ్యామ -- యీ అద్దంలో వాళ్ళు కనపడుతూవున్నారు. మన రెడ్డిపెళ్లామును యెలాముద్దు పెట్టుకుంటూవున్నాడో!

రామా -- పట్టపగలు ఆడదాన్ని వాడలాచెయ్యడం నీకు యిష్టముగావున్నదా?

శ్యామ -- మొగుడు పెళ్లామును ముద్దు పెట్టుకుంటే అందులో తప్పేంవున్నది?

రామా -- తప్పితం లేదుగాని నేను వక్కమాటు కరటక రెడ్డిని కూకలు వెయ్యవలెను. నీవవతలకుపో.

శ్యామ -- పెళ్ళామును ముద్దు పెట్టుకొన్నందుకు కాదుగద?

రామా -- అందుకోసము కాదు. మరొకందుకు కూకలు వేస్తాను.

శ్యామ -- అలాగైతే నేను లోపలికిపోయి వాళ్ళు కాపురం వుండడానికి దంపుళ్ళగదిచోటుచేయించివస్తాను. (అని వెళ్లుచున్నది.)

(అప్పుడు కరటకరెడ్డి ప్రవేశించుచున్నాఁడు.)

రామా -- అప్పుడే మీరు రావడానికి తీరుబడి అయిందీ? యింత వేగిరం దయచేశారేమి?