పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 19

శ్యామ -- నీవు కూడావున్నతరువాత భార్యలేనిలోపం వుండదు. ఇటువంటిది ముందు యెప్పుడయినా మళ్ళీతటస్థిస్తే నాకు ముందుగా వర్తమానము పంపుమా.

కర -- తప్పకుండా పంపుతాను. ఇక నాలుగురోజులకు తటస్థ మవుతుందనగానే మనిషినిపంపుతాను.

రామా -- అయినదానికి విచారించిన కార్యములేదు. మనము లోపలకు వెళుదాము రా. (కరటకరెడ్డితో రహస్యంగా) మేము వెళ్ళగానే మోహినిని అవతలికి పంపివెయ్యి.

శ్యామ -- నాకు చెమటపట్టింది. లోపలికిరాను. కొంచెము సేపు చల్లగాలికి యీవసారాలో మల్లిపందిరిదగ్గిర కూర్చుంటాను. నామల్లిచెట్టుకు రోజూనీళ్ళుపోయిస్తూవున్నారా?

రామా -- వసారాలోకా?

శ్యామ -- వసారాలోకే వెళుతాను.

రామా -- (కరటకరెడ్డితో రహస్యంగా) నీవేదో మాయోపాయం కల్పించి బొంకవలెను. తక్షణం యేదో అబద్ధంకల్పించి నామానందక్కించు.

కర -- అమ్మా! వసారాలో యెవరున్నారో మీకు తెలియదు. నన్ను క్షమించవలెను.

శ్యామ -- వసారాలోయెవరున్నారు? నిన్ను క్షమించడానికి యేం నేరంచేసినావు?

కర -- ఒక చక్కనిచిన్న దాన్ని నేను తీసుకొనివచ్చి-

రామా -- (తనలో) వీడునాగుట్టు బయలపెడుతూవున్నాడు-

శ్యామ -- ఏమీ! నేనులేనిసమయంలో నాయింటికిఆడదాన్ని తెచ్చినావా?

రామా -- (కోపముతో) చక్కనిచిన్నదాన్నా? కానీ చెప్పు చెప్పు.