పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 10

యింట్లోకూర్చునేవారికి మీకు లోకంసంగతి యేమితెలుస్తుంది? లోకంలో దేవరరహస్యాలుయెన్నోవుంటవి. యెరిగినవాణ్నినామాట నమ్మండి. మొగుడు బ్రతికివుండగానే కొందరు పెళ్ళాలు వెధవలూ అవుతారు. పెళ్ళి అయినతరువాతకొందరు గృహస్థులు బ్రహ్మచారులూ అవుతారు. ఇవన్నీ ఇప్పుడెందుకుగాని మీరుచూచినది పొన్నమండ భీమన్నకూతురు. దాని మొగుడు ముసలివాఁడు.

రామా -- ఆచిన్నదాని సంగతంతా నీవిదివరకే యెరుగుదువా?

కర -- ఒక్కయెరగడమేకాదు. రేపుతెల్లవారేలోగా ఆచిన్నదాన్ని మీసొమ్మేచేసివేస్తాను. మీరు యిప్పుడే బయలుదేరి వారి యింటికి యెదురుగుండావున్న అరుగుమీద ఈరాత్రంతా పరుండ వలెను. తెల్లవారేలోగా మీకాచిన్నదాన్ని తీసుకునివచ్చి మీకన్నుల పండుగచేస్తాను. మీకుతెలియకుండా మీవద్దకు తీసుకురావాడానికై మీనిమిత్తం నేను ప్రయత్నంచేస్తూవున్న దే ఆచిన్నది.

రామా -- ఆలాగే? నీవు బహుబుద్ధిమంతుఁడవు. నీఋణం నేను వుంచుకోను. ఆచిన్న దాన్ని నాకుదక్కించితివా, నీకు యిరువయిరూపాయయలు బహుమానంచేస్తాను. నేను యెప్పుడూ చేసిన మేలు మరచిపోనుసుమా.

[అప్పుడకస్మాత్ముగా మగనివెనుకవైపునుండి మోహిని లోపలికి వచ్చుచున్నది.]

కర -- ఆయిరవై రూపాయలూ నాచేతిలోపడ్డవే, పాపం దానిమొగుడు అదృష్టహీనుఁడు.

రామా -- (మోహినినిచూచి) ఏమి యీభాగ్యము! కరటకా! ఇవిగో నీరూపాయలుపుచ్చుకో. (అనిచేతిలోపెట్టుచున్నాఁడు.)

కర -- ఏమియీభాగ్యము! నాకుముందుగానే రూపాయలు యిస్తూవున్నారు! (అని వెనుకతిరిగి మోహినిని చూచుచున్నాఁడు.)