పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 8

రామా -- నేను స్టీమరువద్దకు వెళ్ళేటప్పటికి వక్కతమాషా జరిగింది. టిక్కెట్టు పుచ్చుకొని, ఆతమాషాచూచి మళ్ళీవత్తామని యిట్లేఅవతలికి వెళ్ళేటప్పటికి స్టీమరువాళ్లు స్టీమరు తీసుకుని చక్కా పోయినారు. రివిన్యూ వుద్యోగస్థులకోసం కనిపెట్టుకొనివుంటూ నానిమిత్తం యెందుకు కనిపెట్టుకుని వున్నారుకారో వాళ్ళపని నేను రేపు పట్టిస్తాను. రెడ్డీ! ఆతమషాయేమో నీవువూహించఁగలవా?

కర -- నాకు ఆమాత్రం బుద్ధిలేదు. అయినా కానీ మీకు యెవర్తో చక్కనిపడుచుచిన్నది కనపడ్డ దనుకుంటాను.

రామా -- నీవు చక్కగా కనిపెట్టినావు. నీకుజ్యోతిషంకూడా తెలిసినట్లున్నదే? నీవు మాసిద్ధాంతిగారికంటెను దాఖలాగా చెప్పినావు. నీవెక్కడ బుద్ధిహీనుఁడవు? నీవు బుద్ధికి బృహస్పతివి.

కర -- ఇదంతా మీదయ.

రామా -- నాకు మూడురోజులకింద రతీదేవివంటి వొక్క చక్కనిచిన్నది నేనూ నాస్నేహితుఁడూ కలిసివస్తూవుండగా కనపడ్డది. ఆచిన్న దే స్టీమరుమీదికి యెక్కబోతూ వుండగా కనపడ్డది. ఆచిన్నదే స్టీమరుమీదికి యెక్కబోతూ వుండగా దూరంగా మళ్ళీ కనపడ్డది. నేను రేవులోనుంచి వీధి మొగకు వచ్చేటప్పటికి యేయింట్లోకిపోయిందో మళ్ళీకనపడ్డదికాదు. వీధంతా యీచివరినుంచి ఆచివరకు నాలుగుమాట్లు తిరిగి యెక్కడా కనపడక ఇంతలో స్టీమరుకూడా దాటిపోయినందున తిరిగి యింటికివచ్చినాను.

కర -- (తనలో) ఇతనికేదో గొప్పయెరదొరికింది. అందుచేత యితణ్ని మళ్ళీ పంపించివేసి యీరాత్రి నేను భార్యతో సుఖంగా వుండవచ్చును. ఇతణ్ని మాయచేసి యెక్కడా పడుచులులేని యింటి యెదుట వీధి అరుగుమీద తెల్లవారిందాకా కూర్చోపెట్టివస్తాను. (ప్రకాశముగా) మీకుకనపడ్డచిన్నది యెఱ్ఱని పలచని చిన్నదికాదు గదా?