పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 6

కర -- అవన్నీ యీరాత్రేచేస్తాను. ఈరాత్రి మనం అమ్మగారి గదిలో పరుపులమీదను పట్టెమంచాలమీదనూ పరుందాము. చీకటిపడ్డతరువాత పంతులుగారిబండిలో యెక్కించి నిన్ను పెద్దవీధి గుండా తిప్పుతాను. తోటమాలీ వెంకడిచేత నీకు కావలసినన్ని పనులు చేయిస్తాను.

మోహి -- అలాగయితే పెళ్లినాడు పెట్టిన మధురచీర కట్టుకుని నిమిషాలలో నేను యింటికి వెళ్ళిమళ్ళీవస్తాను, ఈలోపుగాబండి అన్నీ సిద్ధముచేయించు.

కర -- వెళ్ళి యిక్కడవున్నట్టురా. నీవు వచ్చేటప్పటికి ఫలహారానికి మిఠాయికూడా తెప్పించివుంచుతాను. మనంఫలహారంచేసి చల్లపాటువేళ చల్లగాలిలో హాయిగా షికారుబయలుదేరుదాము.

మోహి -- మంచిగంధమూ మల్లెపూవ్వులూకూడా తెప్పించ వలెనుసుమా.

(అని పోవుచున్నది.)

కర -- ఓరీ! వెంకా! తోటపని మానివేసి యిలారా.

వెంక -- (ప్రవేశించి) బాబూ! యెందుకండి!

కర -- పంతులుగారు వూరికి వెళ్ళేటప్పుడు నీవు తోటపని మానివేసి ఈరోజల్లా నావర్దీలోవుండి నేను చెప్పినపనల్లా చేయుమన్నారు. విన్నావా? నేను చెప్పినపని చెయ్యకపోతే నీకు నవుకరీ వుండదుసుమా. నీవు పెందరాళే భోంచేసివచ్చి రాత్రి నేనూ నాభార్యా పడుకున్నప్పుడు నీవుమాకు పంఖావిసరవలెను. బండివానితో చెప్పి సాయంకాలము షికారువెళ్ళడానికి బండికట్టించి తయారుగా వుంపించు. నీవు ముందుగాపోయి నేను యిమ్మన్నానని పంతులుగారికి వాడుకగా మిఠాయి యిచ్చే కిసిన్‌సింగువద్ద యేబులం పంచదారమిఠాయి రెండుపొట్లాలు కట్టించుకునిరా.