ప్రాణాలు లేచిరాగా "ఆ వెళ్ళేవా రెవరో, దారి తప్పి నేనిక్కడ చతికిలబడ్డాను, వస్తున్నా నాగండి" అంటూ కేక వేశారు, శాస్త్రిగారు.
ఆ స్థలం యెరిగివున్నందున కామోను "బాబోయ్" అంటూ రివ్వున ఆ మనుష్యు లెగిరిపోయారు, ఇది వింటూనే.
తొడలోతు నది దాటి, పేరాసతో శాస్త్రిగారు పంటకాలవ గట్టు చేరుకునేటప్పటికి శ్మశానం తప్పిందంతే, మరి ప్రయోజనం లేకపోయింది.
ఏమిటీ చెయ్యడం?
ఉన్నచోటనే వుండిపోతే యీ జిజ్ఞాస కలక్కపోవును.
పోనీ, ఆకాలవగట్టే వెడదామంటే, సాహసించిన్నీ వెడితే, అనపర్తిగ్రామం ఆ వెళ్ళిన దిక్కునే వుండినా, ఈ కాలవ ఆ వూరి మీదుగానే వెడుతుందో, మరో వూరికేసే మళ్ళిపోతుందో?
మళ్ళీ అసహాయు లయిపోయి, వొక చెట్టుకింద ఆ కాలవ గట్టునే గడిపారాయన, శేషరాత్రి.
తూరుపు తెల్లవారుతోం దనగా మళ్ళీ జనసంచారం ప్రారంభం కాగా, దారి తెలుసుకుని, ఆ పంటకాలవలోనే సచేలస్నానమున్నూ చేసి "మీ యింటో భోజనం చేసే వెడదామనుకుంటూ వచ్చా”నంటూ వచ్చా రాయన, మళ్ళీ మా యింటికి.
మా అమ్మగారు చాలా నొచ్చుకున్నారు.
అయితే, జరిగిపోయిన దానికి చేసేదేమీ లేక, వంట మాత్రం త్వరగా చేసి, భోజనం పెట్టి, శాస్త్రిగారిని పదకొండు గంటల బండికే పంపేశా రామె.
చెప్పవచ్చిం దేమిటంటే?'
బైరాగి శాస్త్రిగారు, స్థూలదృష్టికి వో-ఠ్ఠి అమాయకులు.
సూక్ష్మదృష్టికి మాత్రం మహర్షి.
శత్రువులున్నూ ఆయన నడవడిలో హెచ్చుతగ్గులు చూపించలేరు.
అయితే, పంక్తి అన్వయించడం వచ్చిందా, అందులో యెదురువాదమున్నూ వచ్చిందా, యిక యెలాంటివాళ్ళనీ కూడా “పాతేసి" విడిచిపెట్టేవా రాయన.
ఆ మహానుభావుని అనుగ్రహంవల్లనే నా కోపాటి ప్రవేశం కలిగింది, సంస్కృతంలో.
అదే నా జీవితానికి వెలుగిచ్చింది.
25
మేఘసందేశం పూర్తి అయిపోయింది.
పూర్తి అయిందంటే, బండవల్లన చేసి శ్లోకాలూ శబ్దార్థాలూ జిహ్వాగ్రాన వుంచుకున్నా నన్నమాట, నేను.
కాకపోతే, మేధావులైన మహా మహా సాహిత్యవేత్తలకే అస్వాదించడం పూర్తిగా సాధ్యపడదుగదా, పదిహేనేళ్లు నిండని క్షీరకంఠుణ్ణి, నాకేమి అవగాహన అవుతుందీ, అప్పుడా గ్రంథసారస్యం ?
మరి, అంత చిన్నతనాన గురువు లది యెందుకు చెబుతారూ విద్యార్థులకు?
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
75