Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముదుక్కాలవ తగులుతుంది, దిగి, దాటి, అవతలి గట్టెక్కి చేలగట్టే మళ్ళీ వుత్తరంగానే వెళ్ళు, కాలవగట్టే మాత్రం వెళ్ళకుమా” అని పదిమాట్లు చెప్పారు మా అమ్మగారు.

దీనిమీద “ఆ, కుర్రపిల్లవాడికి చెప్పినట్టంత చాదస్తంగా చెబుతావేమిటి పిన్నీ?” అంటూ చాలా అభిమానపడ్డా రాయన.

మా అమ్మగారూ, ఆమె వెంట నేనూ పదిబారలు వెంటవెళ్ళి సాగనంపి వచ్చేశాం.

“దుహిమ్నః పారంతే" అంటూ శివమహిమ్నం అందుకుని అడుగు ముందుకి వేశా రాయన.

కొంతసే పాయన మాటే చెప్పుకుని మేము పడుకున్నాం.

తెల్లవారుతోంది.

నేను అరుగుమీద కూచుని దంతధావనం చేసుకుంటున్నాను.

అక్కడ పడవ దిగి యిల్లు చేరుకోవలసిన వేళకి "పిన్ని యేమి చేస్తోంది తమ్ముడూ?" అంటూ యిక్కడ మా యింటికి వచ్చారు బైరాగి శాస్త్రిగారు, మళ్ళీ.

నేను తెల్లపోయాను.

"ఏం, దారి తప్పావా నాయనా?" అనడుగుతూ మా అమ్మగారు కాళ్లు కడుక్కోడానికి నీళ్ళిచ్చారు.

"నువ్వన్నట్టే జరిగింది పిన్నీ" అంటూ జరిగిందంతా చెప్పుకునివచ్చా రాయన, తాపీగా కూచుని.

ప్రతీ అక్షరమూ స్ఫుటంగా వుచ్చరిస్తూనేగాని మాట్లాడేవారు కారాయన.

సంధ్యావందనంలో గాయత్రిజపం దగ్గిరికి వచ్చాటప్పటికిది దీక్షే అయిపోయేది.

ఇతర్లకు అష్టోత్తరశతగాయత్రి ముగిశాటప్పటి కాయనకు దశగాయత్రి మాత్రమే అయేది.

కోరి, ప్రాధేయపడి పలికించుకుని మేమెన్నో మాట్లు విన్నాం, మాహేశ్వరసూత్రా లాయన ఉచ్చరిస్తే పరమేశ్వరుడు డమరుకం వాయిస్తున్నాడా అన్నట్టుండేది.

ఈ అలవాటు చొప్పున మహిమ్నశ్లోకాలు స్ఫుటంగా ఉచ్చరించడంలోనూ, వాటి భావం మననం చేసుకోడంలోనూ మురుగుకాలవ దగ్గిరికి వెళ్ళాటప్పటికి మా అమ్మగారు చెప్పిన వివరాలన్నీ మరుపువచ్చాయి, ఆయనకు.

"పిన్ని, కాలవ దాటి అవతలిగట్టే వెళ్ళమందా, దాటకుండా యివతలిగట్టే వెళ్ళమందా?" అంటూ విచికిత్స పట్టుకుందిక్కడ.

ఎటు చూసినా ఎవరూ కనపడలేదు.

పది నిమిషాలు మథనపడి, యీ విస్మృతికి పడవ దాటిపోతుందన్న ఆదుర్దా తోడు కాగా, కాలవ దాటకుండా యివతలి గట్టే పశ్చిమంగా బయలుదేరారు, చివరికి.

ఆ బయలుదేరడం తూర్పుగా అయితే, మైలు దూరాన మహేంద్రవాడ గ్రామమూ తగులును, యిబ్బందీ లేకపోయివుండును.

పశ్చిమంగా వెళ్ళడం అసందర్భమే కాదు, ముప్పున్నూ అయిపోయింది.

72

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1