మహావైయాకరణి నోరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి దగ్గిర సిద్ధాంతకౌముదిన్నీ చదివారు.
విశేషం యేమిటంటే?
కౌముది నిక్కచ్చిగా పాఠం చెప్పేవా రాయన; యిక కావ్యనాటకాలకు, చదివిందీ చదవందీ అన్న భేదమే లేదు.
అగ్రహారీకులు కనక, అగత్యం లేక దేశం తిరగలేదు గాని, సాహిత్యవేత్తగా బాగా ప్రఖ్యాతి పొంది వుండతగ్గవారు బైరాగిశాస్త్రిగారు.
తల్లిదండ్రులకు చాలామంది పిల్లలు నష్టపోయాక నిలిచిన మొదటి పురుషసంతానం బైరాగిశాస్త్రిగారు, అంచాతే వచ్చింది 'బైరాగి' అన్న పేరు, వారికి.
జాగ్రదావస్థలో వుండినంతసేపూ జపం చేసుకోడమూ, పాఠాలు చెప్పడమూ - ఇంతే ఆయన దినచర్య.
నడుస్తూ కూడా ఆయన సాహిత్య విషయాలే ఆలోచించేవారు, తాదాత్మ్యంతో.
మరో విషయమే ఆయన తలకెక్కేది కాదు.
"రెండూ మూడూ యెంత ?" అనడిగితే "యెనిమిది కాదూ?” అని యెదురడిగినట్టుండేది ఆయన లోకజ్ఞానం.
మొత్తానికి బైరాగిశాస్త్రిగారి స్వభావం విచిత్రంగా వుండేది.
నాకు బాగా చిన్నతనం.
ఒకమాటు, తమ పెద్దమేనమామ పెదపూర్ణయ్యసిద్ధాంతిగారి వూరు పులగుర్త నుంచి దీపాలు పెట్టేవేళకు మా పొలమూరు వచ్చా రాయన.
ఇంటో మా అమ్మగారూ, మా చిన్నక్కా, మా చెల్లెలూ, నేనూ మాత్రమే వుండినాం.
రాత్రి భోజనం కావడం తడువుగా "పిన్నీ, మరి వెడతా”నంటూ లేచా రాయన.
"రేపు పొద్దుటి బండికి వెడుదువుగాని, నాయనా” అన్నారు మా అమ్మగారు, ఆయన వినిపించుకోలేదు.
"ఇల్లు విడిచి నాలుగు దినాలయింది, వెళ్ళా"లనే తప్ప మరో మాటే రానివ్వలేదాయన.
పొలమూరికి మైలుదూరాన వున్న అనపర్తి దగ్గిర యెక్కితే, వారి గుమ్మంలో దిగుతుంది, చామర్లకోట కాలవపడవ, తెల్లవారాటప్పటికి.
రాత్రంతా మాత్రం పడవలో వుండాలి, అంతే.
కానయితే, పుచ్చపువ్వులా వెన్నెల కాస్తూనే వుంది.
అయినా ఆయన సంగతి తెలుసు కనక “నాయనా, చేలగట్ల మీదుగా వెళ్ళాలి. చీలికలు వచ్చినచోట నిర్దేశించి చెప్పడాని కిప్పుడెవరూ వుండరు. నువ్వు అనపర్తి వెళ్ళలేవు, నా మాట విను, వెళ్ళవద్దు" అంటూ చిలక్కి చెప్పినట్టెంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు.
యాదాలాభంగా అయితే యెవ రెన్నిచెప్పినా వినేవా రాయన, సొంతంగా అనుకున్నారా, మరి ఫాలాక్షుడు చెప్పినా లాభం లేకపోయేది.
ఏమి తటస్థించనీ, అనుకున్నంతా చేసెయ్యవలసిందే.
అంచేత, చేసేది లేక "అయితే, యిదిగో, వుత్తరంగా వెళ్ళు. ఊరు దాటాక
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
71