ఇలాగ మదనకామరాజు కథలు చదువుతూ చదువుతూనే, వుండుండి వొకనాడు "నేను రేపు మా వూరు వెళ్ళిపోతున్నా"నన్నా నావిడతో.
"ఏమి నాయనా?” అందావిడ, నిర్విణ్ణయి.
చాలా విచారించింది, ఆ మాటమీద.
ఏదో చెయ్యిజారిపోయేటప్పుడు కలిగే విచారంలా వుండిందామె విచారం.
"ఇక్కడ చదువు సాగడంలేదూ?" అనడిగింది.
నచ్చచెప్పడానికిన్నీ యెంతో ప్రయత్నించింది; కాని లాభంలేకపోగా "వెళ్ళేటప్పుడొకమాటు నాక్కనపడు. పోనీ యీ దారినే వెళ్లు" అంది.
ఎందుకో అర్ధం కాలేదు గాని, మర్నాడు మూట చంకని పెట్టుకుని వెళ్ళగా, పెద్ద పటికిబెల్లం పొట్లం చేతిలో వుంచి “వెళ్ళినచోట శ్రద్ధగా చదువుకో నాయనా" అంటూ, దీవించి పంపించింది.
అయితే, నాచేత అది చదివించుకుని ఆవిడ పొందిన ప్రయోజనం యేమిటో గాని, నాకు మాత్రం మంచి కథాభిరుచి కలిగింది దానివల్ల.
అదే కథారచనలోకి దింపేసింది, చివరికి నన్ను.
తరవాత, ఈ అరవైయేళ్ళ జీవితంలోనూ నేనెన్నో కథల పుస్తకాలు చదివాను కాని, మదనకామరాజుకథ లంటే యిప్పటికీ నా కెంతో ప్రీతి.
అంచేత, ఆ వెళ్ళడంలో, మండపేటలో ఆ కథల పుస్తకం కొనుక్కునే నే నింటికి వెళ్ళాను.
రోజూ రోజూ చదివానది.
వయసు వచ్చినకొద్దీ అర్థం అయింది నాకది.
అర్థం అయినకొద్దీ ప్రీతిపాత్రమున్నూ అయింది నాకది.
దాని మాధుర్యానికి చొక్కి తరువాత చాలాకాలానికి సరళభాషలోకిన్నీ మార్చేశానది.
శ్రీ వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు చేయించా రాపని నా చేత.
వ్యాపారదృష్టితోనే వారాపని చెప్పారు, నాకు తగిన ప్రతిఫలం యిచ్చే చెప్పారు, నిజమే.
అయితే, దానియెడల నా కృతజ్ఞత తెలుపుకోడానికి - ముఖ్యంగా నా రుణం తీర్చుకోడానికి నేనే చెయ్యవలసిన పని కనకనే వారు నాకు చెప్పారన్న నమ్మకంతో అందు కొప్పుకున్నా న్నేను.
23
బ్రహ్మశ్రీ దర్భా బైరాగిశాస్త్రిగారు హుశేనుపురం అగ్రహారీకులు.
చామర్లకోటకి పశ్చిమంగా మైలుదూరాన వుందావూరు.
వారి పూర్వులకు పిఠాపురం మహారాజులుంగా రిచ్చివుండిన ఆగ్రహారం అది.
పిఠాపురంవారు దానికి పెట్టిన పేరు "నరసింహారాయపురం అగ్రహారం" అని.
అయితే, అది హుశేనుపురం గ్రామానికానుకుని వుంది.
అంచేత, చిరపరిచితమైన హుశేనుపురమే గాని ఆ పేరు వాడుక కాలేకపోయింది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
69