Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నా కెలా వస్తాయి నాయనా?" అనడిగింది, మరి, యిదెలా వచ్చిందో?

“ఎక్కడయినా దొరికితే నువ్వే తీసుకురా పోనీ" అంది.

"డబ్బులు నేనే యిస్తానులే” అని ధైర్యం చెప్పింది.

చేసేది లేక అదే మళ్ళీ చదివాను.

మళ్ళీ మళ్ళీ కూడా చదివాను.

క్రమాంతరాలమీద వొక్కొక్క సన్నివేశం కొంచెం కొంచెం అర్థం అవుతున్నట్టనిపించసాగింది నాకు.

అది గ్రహించి తల పంకించుకునే దావిడ.

మొత్తం నాలుగయిదు మాట్లయినా మళ్ళీ మళ్ళీ చదివాను నేనది, విసుగుమాత్రం కలగలేదు నాకు.

ఆవిడ యెన్నాళ్ళబట్టి వింటోందో మరి, వ్యగ్రోత్సాహంతో అయితే, అవిడ కదొక్కటే గతి అయింది నాకేం?

అన్ని మాట్లది చదివేటప్పటికి వసుచరిత్ర మీదికి పోయింది నా చూపు.

గురువుగా రందుకు నిషేధం చెప్పివుండడంవల్ల ఔత్సుక్యం మరీ యెక్కువయి పోయింది.

తన అరుగుమీద కూచుని, భట్రాజుల అబ్బాయి, పాఠం వల్లించుకునేటప్పుడు చూడనూ చూశా నాగ్రంథం నేను.

అయితే పద్యాలా, వుక్కు తునకలా అవి?

పోనీ అంటే, వచనమూ అలాగే వుంది అందులోది, కరిగిన ద్రవం - జాతికి మాత్రం వుక్కే.

విసిగిపోయా న్నేను.

గుజిలీ పుస్తకమే అయినా, దాంతో మదనకామరాజు కథల భాష అమృతమే అయిపోయింది నాకు.

వచనంలో వున్న సౌలభ్యం పద్యంలో లేదని - వుండడానికే వీల్లేదని పాఠశాలలో మూడో తరగతిలో రుక్మిణీ కళ్యాణం చదివినప్పుడే అనుభూతం అయివుండింది నాకు.

పోనీ, అర్థమే కానక్కరలేదనుకుంటే, వసుచరిత్రలో వాచకమే సరిగా నడవలేదు నాకు.

పాఠశాల చదువు తక్కువే అయినా, ధారాళమైన వాచకం నాది మొదణ్ణుంచీ.

గురువుగారే అనేవారీమాట, తక్కిన విద్యార్థులను నిరసిస్తూ.

కాని, ముళ్ళడొంకల్లో బోసికాళ్ళ నడక అయిపోయింది. ఆ వసుచరిత్రలో నా వాచకం.

పద్యంమీదకంటే వచనంమీదా, వచనంలో మళ్ళీ సులభమైన సరళవచనంమీదా రుచీ, అభిమానమూ కలగడాని కిదేకారణం అయింది నాకు.

తరవాత మరెన్నో ఘటనలున్నూ తటస్థపడి, యీ వచన ప్రీతి నాకు స్థిరపడిపోయింది.

ఇక యిక్కడ చెప్పవలసిం దేమిటంటే?

68

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1