Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికత వుంటే గాని ధ్వని అవగాహన కాదు, లేశమూ.

బుద్ధి వుంటే చాలు, చమత్కారమూ సారస్యమూ బోధపడతాయి, క్షుణ్ణంగా.

పాండిత్యాని కవే విలాస భూములు.

పండితుడైనవాడు అక్కడే తాండవం చేస్తాడు, ఆవేశంతో.

అసలు, శబ్దంమీద అధికారం యేర్పడితేనే దాని శక్తి తెలుస్తుంది, పండితునకు.

అదే వేత్తృత.

వ్యాఖ్యాతకు అదే యోగ్యత.

మరి, రచయిత అంతస్థు వేరు.

రచయిత అంటే కవికి పర్యాయం.

క్రాంతదర్శి అతను.

భావనాశక్తి సర్వజ్ఞత్వం ప్రసాదిస్తుంది, రచయితకు.

కనక, రచన, ద్రాక్షాపాకం అయినా, నారికేళపాకమే అయినా రచయిత ఆస్వాదించే పట్టులు వేరూ, పండితుడు వ్యాఖ్యానించే ఘట్టాలు వేరున్ను.

కవిత్వమూ పాండిత్యమూ భిన్నశక్తులు.

అవి రెండూ కలిసిన స్థలాలుంటాయి; కాని కలవకపోడం మాత్రం లోపం కాదు.

వసుచరిత్ర కర్త స్పష్టంగా, ఆ రెండు శక్తులూ వున్నవాడు కూలంకషంగా.

మరి, పాండిత్యమయినా లేనివాడి కతని రచన యెలా కొరవడుతుందీ?

కొరకబడలేదని నిందించడమేనా?

అయితే, అప్పుడు, దినమ్మూ గురువుగా రాయనకు పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినేవాణ్ణి గాని, పేరుకి తెనుగు గ్రంథమే అయినా, రుక్మిణీకల్యాణం బడిలోనే చదివి వుండిన నా కది మరొక భాషకు చెందిన గ్రంథం అనిపించేది.

తెనుగువాడికి సంస్కృతం పరిచితం కావడమూ, తెనుగే పరాయి భాషగా కనపడ్డమూ వింతే! అయితే, పరిచితం అయిన సంస్కృతం కూడా అందులోది నా కదో విధంగా కనపడేది.

అదేమీ అంటే, తెనుగుకవుల సంస్కృత ప్రయోగసరణి వే రన్నారు, గురువుగారు.

భరతఖండాని కంతటికీ సంస్కృతం సామాన్యభాషే అయినా, అన్ని ప్రాంతాలవారి సంస్కృత ప్రయోగసరణీ అలాగ, భిన్న భిన్నంగానే కనపడుతోం దిప్పుడు చూస్తే.

ఇది ప్రాంతీయాలైన మాతృభాషల ఘనతకూ ప్రాధాన్యానికీ మాయని గుర్తు.

ఈ సంగతు లప్పుడు నాకు లేశమూ తెలియవు.

చదువే కాదు, వయసే చాలదు తెలుసుకోడాని కయినా.

కాక : -

నా కప్పు డది అవగాహన కాకపోవడమే మంచి దయింది.

“నా తెనుగు నా కెందుకు తెలియకపోవాలీ?" అని నా కావేదన కలగడానికీ, దాని విషయమై శ్రద్ధ పుట్టడానికీ అదే కారణం.

ఈ ఆవేదనతో “దినమ్మూ నా కదిన్నీ చెప్పండి" అని కోరాను గురువుగారిని; కాని వారు చెప్ప నన్నారు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

63