Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తచ్చాడి తచ్చాడి, బతిమాలి బతిమాలి, అరవై టపాకాయలిచ్చి రెండు జువ్వలు పట్టుకుపోయా డతను, చివరికి.

"నాకు మాత్రం సరదా కాదూ?" అంటూ రెండు జువ్వలట్టేపెట్టుకున్నా న్నేను; కాని లాభం లేకపోయింది.

దేవాంగియువకుడు చెప్పగా కంగారుపడిపోయి, రెడ్డియువకుడున్నూ అరవైటపాకాయలూ పట్టుకువచ్చాడు పాపం, ఆశపడి; కాని నాకెందుకూ అవీ?

అతను టపాకాయలతోబాటు కాకరపువ్వొత్తులున్నూ తయారుచేసుకున్నాడు, చక్కగా బీడు కలిపి.

వాటిలో నే నేరుకున్నవి పది వత్తులిచ్చి రెండు జువ్వలూ అతను పట్టుకుపోయాడు.

"చీకటి జువ్వలు లేకపోతేం, తక్కినవి రకరకాలు దండిగా వున్నాయి గదా?" అని తృప్తిపడ్డా న్నేను.

సొంతంగా తయారుచేసిన మందు యాభై పైగా అయింది, మతాబాలు.

అవీ, కాకరపువ్వొత్తులూ, టపాకాయలూ మా చిన్నక్కా మా చెల్లెలూ పుచ్చుకున్నారు.

జువ్వలూ చక్రకాయలూ మిగిలాయి నాకు.

చద్దన్నం తిని అన్నీ యెండలో పెట్టు క్కూచున్నాను.

మధ్యాహ్నం భోజనం చేసి వూళ్ళోకి బయలుదేరాను, మిత్రుల్లో యెవ రెవరి సామగ్రి యేమాత్రమో చూద్దామని.

దేవాంగి యువకుని యింటికి వెళ్ళాటప్పటికీ, అతని చెల్లెలు పన్నెం డేళ్ళది, తన భర్త తెచ్చి యిచ్చిన బాణసంచా అంతా తన అన్న బాణసంచాతో కలపకుండా వేరే యెండబెట్టుకుని పక్కనే చూరుకింద కూచుని మురిసిపోతోంది, మహా

ఆ సన్నివేశం చూశాటప్పటికి మా సీత జ్ఞాపకం వచ్చింది నాకు.

అది కోరుకున్నది కోరుకున్నంతా తండ్రి కొని యిచ్చాడో లేదో అని బెంగపట్టుకుంది, వెంటనే నాకు.

"తండ్రి కొంటాడు, మానడు; కాని తమ్ము లేమయినా కొట్టేస్తున్నారేమో బెల్లించి" అని కంగారున్నూ పట్టుకుంది.

"పోనీ, మన కున్నదాన్లో కొంత దానికి పంపితే?” అని సరదా పుట్టింది, వెంటనే.

నిజమే, కాని అమావాస్య కదా ఆవేళ, మనిషి యెక్కడ దొరుకుతాడు?

దొరికినా యిరవై మైళ్లు నడవాలి రెండు గోదావరులు దాటి, పొద్దేది?

ఇంతకీ, నా యీ వూహ చెబితే, మా చిన్నక్కా మా చెల్లెలూ యెగతాళి చేసి చంపుతారేమో?

మా బావగారు మా యింటి కేమి పంపలేదు, అంచేత “మన బ్రాహ్మల్లో అలాంటి ఆచారం లేదని కూడా అంటుందేమో మా చిన్నక్క ?

మా అమ్మగారున్నూ యేమంటారో?

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

59