చీకటిజువ్వల సంగతి విని మొదట నమ్మలేకపోయారు గాని; చివరికి వింతపడి ఆశపడ్డారు కూడా.
“అవి బాగుండేటట్టయితే - కొన్ని మా కిచ్చేటట్టయితే మామూలుజువ్వలు మార్పిస్తా"నని ఆనందమూ “చక్రకాయ లిస్తా"నని అప్పలాచార్యులుగారూ చెప్పి వెళ్ళిపోయారు.
పొద్దు గూకింది.
అప్పటికి. మతాబాగొట్టాలు చెయ్యడమూ, అవి ఆరడమూ, మందు మెత్తగా నలగడమూ అయిపోయింది.
బాగా చీకటిపడ్డాక స్నేహితులిద్దరూ వచ్చి, నేను జువ్వకాల్చగా చూసి డంగయిపోయారు.
ఉత్తరక్షణాన, ఆనందం పాతికజువ్వలూ, అప్పలాచార్యులుగారు పాతిక చక్రకాయలూ యిచ్చి, చెరో పది చీకటి జువ్వలూ పట్టుకునిన్నీ వెళ్ళిపోయారు.
తెల్లవారాటప్పటికి చీకటి జువ్వల సంగతి కుర్రకారుని కంగారుపెట్టేసింది.
ఒక దేవాంగి యువకమిత్రుడూ, వొక రెడ్డియువకమిత్రుడూ వచ్చి "తాటాకు టపాకాయ లిస్తాం, చీకటి జువ్వలి"మ్మన్నారు.
జువ్వకు పాతిక కాయలివ్వడానికిన్నీ వొప్పుకున్నారు గాని, వొక జువ్వ కాల్చి చూపించాలని మాత్రం షరతు పెట్టారు.
నే నొప్పుకోలేదు.
వాళ్ళున్నూ వెళ్ళిపోయారు, బెట్టుసరిగా.
వెళ్ళిపోయారేగాని చీకటిజువ్వలమీద ఆశ చంపుకోలేక పోయారు, కొంచెమయినా.
ఆ రాత్రి దేవాంగియువకుడు యుక్తిచేసి, అప్పలాచార్యులుగారిచేత జువ్వ కాల్పించి చూసి, అద్భుతపడి ఆత్రాపడి ఆ రాత్రి తెల్లవార్లూ ఆరాటపడిపోయి, తెల్లవారడం తరవాయిగా నూరుటపాకాయలు పట్టుకుని వచ్చి వాలాడు నాదగ్గరికి, “ఇచ్చెయ్యండి నాలుగు జువ్వలూ" అంటూ.
అతని వుబలాటం చూసి నేను కొమ్మెక్కి కూచున్నాను.
"జువ్వకి పాతిక్కాదు, యాభయి కాయలివ్వా"లన్నాను, కచ్చితంగా.
దానిమీద అతనికి కోపం, నిరాశ, విసుగు, ఉడుకుమోత్తనం, ఎలాగయినా జువ్వలు పట్టుకుపోవాలన్న పట్టుదల - ఇలాంటి వెన్నో కలిగాయి.
"ఎంత ఆశా?" అన్నాడు, హేళనగా.
"న్యాయం వుండవద్దా?" అన్నాడు, తెలివిగా.
"స్నేహం యింతేనా?" అన్నాడు, నిష్టురంగా.
చూసిచూసి, వినివిని "మరి, నువ్వు చూపించిన స్నేహం మాత్రం యేదీ?” అంటూ యెదురుకున్నా న్నేను.
"తెచ్చినవి పాతిక, వాళ్లకిచ్చేసినవీ నేను కాల్చేసిందీ పోను నాలుగే కదా నాకున్నవి? టపాకాయలు లేనేలేవు గదా, చీకటిజువ్వ లయినా వుండవద్దూ నా కామాత్రం అయినా?” అన్నాను యుక్తిగా.
58
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1