Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది తెలిసి వాడితేనే శబ్దాలలో శక్తి కనపడినా, కవిత్వం పొటమరించినా.

గొప్ప పండితులు మాత్రమే అయినవారు చేసే రచనలు గొగ్గిపళ్ళలాగ అసహ్యంగా వుండడానికీ, నిజంగా కవులయినవారు చేసే రచనలు ద్రాక్షగుత్తుల్లాగ ఆస్వాద్యాలు కావడానికీ యీ పరిజ్ఞానం లేకపోవడమూ వుండడమూ తప్ప మరేమీ కారణం కాదు.

పద్యంలోనూ వచనంలోనూ కూడా వ్యాకరణగ్రంథాలెన్నో వున్నాయి మనభాషలో; కాని తత్కర్తలలో వొక్కడికిన్నీ ప్రయోగవైచిత్రికి సూత్రాలు పన్నా లన్న జ్ఞానమే లేకపోయింది.

జాతిని పట్టుకుని వుండే విషయాలకు సంబంధించి వచన వాఙ్మయం లేకపోయింది మనకి ప్రాచీనం, అంచేత కూడా మనవారికి మన భాషలో జాతీయమైన పలుకుబడి అందని పండయిపోయింది.

కాక :-

కవిత్వ పరిధుల్లోనే కాదు, శబ్దాలకు, సంఘ పరిధుల్లో కూడా యీ విచక్షణ మిక్కిలీ అగత్యమే.

కాని, అగ్రజాతులవారున్నూ అనేకులు స్థలాస్థలాలూ, తరతమభేదాలూ గుర్తించుకోకుండా దుడుగూదుడుగూ మాట్లాడేస్తారు, మనలో.

తరతరాలుగా. నిన్నటిదాకా ప్రభువులూ, ఇవాళదాకా జమీందార్లూ, వారివారి బంధువులన్నూ అయి వుండినవారు కనక, క్షత్రియులూ పద్మవెలమలూ మాత్రమే ఉన్నతసంప్రదాయాలు నిలుపుకుంటూ వస్తున్నారు మాటలు వాడ్డంలో, మనలో - ఇంకా.

స్త్రీలయినా పురుషులయినా ఉన్నతకుటుంబాలకు చెందిన యిద్దరు క్షత్రియులు కలిసి కాస్సేపు మాట్టాడుకుంటే, అది సాంసారిక ప్రసంగమే అయినా, మహాకవులున్నూ పట్టుకోవలసినంత మధురంగానూ హుందాగానూ వుంటుంది, వారి భాష.

చిన్నతనంలోనే రచనావ్యగ్రత కలగడానికి తోడు మా వూరిలోనే రాజబంధువులయిన శ్రీ దాట్లవారి కుటుంబం వుండడమూ, ఆ కుటుంబంతో నిత్యసాహచర్యం వుండడమూ, నిజంగా, సరస్వతీదేవి సాక్షాత్కరించి కాళిదాసుకి నాలుకమీద బీజాక్షరాలు రాసిందిట చూడండీ - అలా అయింది నాకు.

18

తూర్పు తెల్లవారుతోం దనగా కలుసుకునేవాళ్ళం, మళ్ళీ చీకట్లు ముదురుతున్నా యనగా విడిపోయేవాళ్ళం మేము.

మా వూళ్ళో, బుద్ధవరపు పేర్రాజుగారనే నియోగివృద్దు లోకాయన “ఇంకొకణ్ణెవణ్ణయినా కలుపుకోండి, పంచపాండవు లయిపోతా”రనే వారు, మమ్మల్ని చూసి తరుచు.

మా పొలాల జమాబంధీకి సంబంధించిన గాధ అనేకాలు, వాటిలో మరొకటి, - మా వూరి రైతాంగం అంతా భూమంచిరెడ్లు.

50

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1