ఎదుట నుంచుని రాజుగారితో మాట్లాడుతున్నాడు రైతు, అతని తమ్ముడు. చెంబులూ గ్లాసులూ కలిపి మూడు పాత్రలతో పచ్చిపానకం తెచ్చి మా యెదట వుంచాడు.
అయితే, వచ్చిన పని మరిచారు రాజుగారు, పానక పాత్రలూ గమనించలేకపోయారు, మాటమీద మాట ఆడేస్తున్నారు, రైతుతో.
మాకు మాత్రం నోళ్ళూరిపోతున్నాయి.
కాకపోయినా, అలస్యం అయితే, గానుగులో పిండినచెరుకు రసం కనరెక్కిపోతుంది, అందులో దవ్వ వేసినా.
ఉండలేకపోయాడు ఆనందం.
"తాగండి" అన్నాడు రాజుగారిని, ముందే మేము పుచ్చుకోడం ధర్మం కాదు, కనక.
కాని దాంతో యెగిసిపడ్డారు రాజుగారు, పళ్ళు పటపట్టాడిస్తూనూ, నిప్పులు కక్కుతూ చూస్తూను.
"తాగండిట తాగండి. నాలుక ఆడినట్టల్లా వాగడమేనా? కల్లు తాగుతారు, పానకం పుచ్చుకుంటారు, తెలుసా?" అనిన్నీ వురిమారు వారు, వూగీసలాడుతూ.
అదే మొదటి మాటు వారి ప్రచండ మూర్తిని చూడడం, చకితుణ్ణయి పోయా న్నేను.
కొయ్యే అయిపోయాడు, ఆనందం.
ఏమిటో, యెందుకో తెలియక దిగ్భ్రాంతు డయిపోయాడు రైతు.
చూసిచూసి, తమకి తామే ప్రపన్ను లయినారు రాజుగారు, కాగి చల్లారిన పాలవంటి వయస్సు కనక, వొక్కక్షణానికి.
అప్పటికీ మేము బెదురుచూపులే చూస్తున్నాం.
అది గుర్తించి పక్కున నవ్వేశారు రాజుగారు, ఆ పరిసరాలన్నీ సౌమ్యపరుస్తూ, ముందు.
“ఇంకెప్పుడూ అలా అనకండి, పానకం పుచ్చుకోండి తొరగా, కనరెక్కిపోతుంది, ఆలస్యం అయితే" అంటూ పాత్ర అందుకున్నారు, తరవాత.
మేమూ అందుకున్నాం పాత్రలు, వొక చుక్క అయినా మిగల్చకుండా పానకమూ పుచ్చేసుకున్నాం గాని; రాజుగారి మొగం చూడలేక పోయాడు, ఆనందం మరి ఆవేళకి సూటిగా. నాకు మాత్రం రాజుగారి ఆక్షేపణ అస్థిగతం అయిపోయింది.
చెప్పవచ్చిం దేమిటంటే?
అది మొదలు - మంచినీళ్ళు, పానకం, పాలు, పెరుగు, మజ్జిగ, సోడా, కాఫీ, టీ - ఇలాంటి వేమయినా - "పుచ్చుకోడం" "పుచ్చుకో" పుచ్చుకున్నాను. అనే తప్ప “తాగడం” “తాగు" "తాగుతున్నాను” అన్నమాట రాదు, నా నోట.
సొంతానికి కొన్ని తెలియకపోవచ్చు, తోచకా పోవచ్చు గాని, చూశాక కూడా మంచి పద్ధతులు అలవాటు చేసుకోకపోవడం వివేకం కాదు, ఎలాంటివారికీ కూడా.
సమానార్థకాలే కావచ్చు కొన్ని శబ్దాలు, భాషలో వాటి అంతస్థులు వేరూ, వాటి ప్రయోజనాలు వేరూ, వాటి ప్రయోగసరణిన్నీ వేరూను.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
49