ఇందులోనూ మళ్ళీ మున్సబుగారి ఆరోతమ్ముడు ఆనందానికీ నాకూ వొకటే ప్రాణం.
ఆటల్లో మా కిద్దరికీ కుండబంతి చాలా యిష్టం.
అందులో, మా వూళ్ళో మమ్మల్నెవరూ గెలవలేక పోయేవారు.
మేమిద్దరమూ అటూ యిటూ పెండేకాసులంగా వుండి, రెడ్డియువకులను సత్రకాయలుగా చేర్చుకుని ఆడేవాళ్ళం తరచు అది.
అప్పు డప్పుడు ఉప్పట్టీ చెడుగుడూ కూడా ఆడేవాళ్ళం.
మా యీడు కుర్రవాళ్ళలో దండపట్లకు ఆనందమూ; దండ దెబ్బలకు నేనూ మొనగాళ్లం.
మా వూళ్లో (మా ప్రాంతంలోనే) చెరుకుతోటలు మెండు.
చెరుకుపానకం కోసం దినమ్మూ మే మొక్కొక్క గానుగు దగ్గిరికి వెళ్ళేవాళ్ళం.
మేమంటే - మున్సబుగారి తమ్ములూ, వైద్యుడుగారి పెద్దబ్బాయీ, సిద్ధాంతిగారి అబ్బాయీ కావడంవల్ల యెక్క డికి వెళ్ళినా, మాకు చెరుకుపానకమూ, చెరుకుగడలూ, వేడి బెల్లమూ, లంజె బెల్లమూ ప్రీతిగా యిచ్చేవారు రైతులు.
కొబ్బరీ, మోహనదుంపలూ పట్టుకువెడితే, పాకంలో వుడికించిన్నీ యిచ్చేవారు, తరుచు.
వేసవిలో ముంజెలు కొట్టించుకు తినడమున్నూ మా ముఖ్య కార్యాలలో వొకటి.
మేమిలాగ పొలాలు తిరుగుతూ వుండడంలో వొకనాడొక విశేషం జరిగింది.
ఆవేళ నేనూ ఆనందమూ దివాకరరాజుగారితో బయలుదేరాం, జట్టు విడిపోయి.
మా వూళ్ళో వొక్కటే క్షత్రియ కుటుంబం, ఆ కుటుంబం యజమానులే దివాకరరాజుగారు.
వారి యేకపుత్రులు సూర్యనారాయణరాజుగారితోనున్నూ మే మెప్పుడయినా ఆడుకునేవాళ్ళం, అయితే, మాకంటే కొంచెం పెద్దలు వారు.
పెద్దాపురం రాజబంధువులు వారు, లోటు లేని కుటుంబం.
ఇంటిపేరు “దాట్ల"వారు; కాని "శ్రీ దాట్ల"వారు అనాలి, వారిని.
బ్రాహ్మణ కుటుంబాలకూ ఆ క్షత్రియ కుటుంబానికీ ఆ వూళ్ళో యెప్పుడూ ఆభేదం.
బ్రాహ్మల కెవరికీ వారితో అర్థార్థిసంబంధం లేదు, హార్దికమే కాని.
దివాకరరాజుగా రప్పటికీ కొంచెం వృద్ధులు, పళ్ళూడిపోయి వుండడంవల్ల పరిచితులకే విడిపోయేవి, వారి మాటలు.
రెడ్లలో యెందరో కౌలుదా ర్లుండేవారు, చెరుకుగానుగుల రోజుల్లో దినాని కొక గానుగు దగ్గిరికి వెళ్ళడం పెట్టుకున్నారు, దివాకరరాజుగారు.
వారే పిలిచారు మా అరుగుమీద కూచుని వుండగా, మమ్మ ల్నావేళ.
రాజుగారిని చూశాడు రైతు, వారితో మమ్మ ల్నిద్దర్నీ చూశాడు, యెదురువచ్చి రాజుగారికి స్వాగతం చెప్పాడు.
మేము ముగ్గురమూ దిమ్మమీద కూచున్నాం.
48
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1