Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొత్తపాఠం స్వయంగా చూసుకుని క్రమం యేర్పరచుకోవాలి, గురువుగారి వీలుకనిపెట్టి చెప్పుకోవాలి. అది మరపురాకుండా వల్లించుకోవాలి. ఆజ్ఞలకు చెవులోరజేసుకునేవుంటూ.

వేళ కని పెట్టుకుని మళ్ళీ రాత్రి భోజనం చెయ్యాలి.

వెంటనే పడుకుని నిద్రపోడానికి వల్లకాదు, దేహళీదత్త దీపం దగ్గిర కూచుని చదువుకోవాలి, యింటివారికి చిరాకు పుట్టకుండా గట్టిగానో మెల్లిగానో

ఇంటో అయితే, అర్థరాత్రి అయినా ముసుగు తన్నుకునే వుండి, అమ్మని లేపి, గద్దించి తెమ్మనవచ్చు, అక్కడ మాత్రం దాహం కావచ్చు కనక, ముందే జాగ్రత్తపడి, సిద్ధంగా వుంచుకోవాలి మంచినీళ్ళ చెంబు - నిద్రమత్తుతో వొత్తిగిల్లడంలో చేతికో కాలికో తగిలి నీళ్ళు వొలికిపోయి, పడుకున్న చాపా, చాపమీద గావంచా, ముసుగుపెట్టుకునే దుప్పట్టీ తడిసిపోకుండా వుండేటట్టు.

ఇంత కార్యక్రమంలోనూ, మధ్యాహ్నం చెప్పుకున్న కొత్త పాఠం వల్లించుకోడం తడువుగా ఎగిరిపోయి దేవాలయ గోపురం పై అంతస్థున కూచునేవాణ్ణి, ఏమిటేమిటో కలలు కంటూ నేను.

నాకు జ్ఞాపకం వుండినంత వరకూ, ప్రయత్నపూర్వకంగా నేను కల్పనకు పూనుకోడానికి మొదలు ఆ గోపురం మీదే,

అక్కణ్ణుంచి చూస్తే ఎదట, వరసగా, విరగబూసిన బొగడచెట్ల శిఖరాలు - ఎడమవైపున, ముడుచుకుపోయిన కలవలతో నిండివున్న కోనేరు - వెనక, చిరుగంటలతో ధ్వజస్తంభాగ్రమూ మిలమిల మెరిసే పసిడికుండతో దేవాలయ శిఖరమూను - కుడివైపున, చేతికందేటట్టు మనిషి కలవిగాని గెలలతో కొబ్బరిచెట్ల తలలు - ఇలాగ, ఆ పరిసరా లందు కనుకూలంగానే వుండేవి.

దీనికి సాయం, అక్కడ, నాలుగువైపులనుంచీ కమ్మనిగాలి రివ్వున కొట్టేది, మధ్యమధ్యమాత్రం గబ్బిలాల కంపుతో కలుషితం అయిపోతూ,

అయితే, భాష రాదు, అనుభవం లేదు, భావాలు పుట్టవు. అయినా, వినివుండిన కొద్ది కథలూ ఆధారంగా, చక్కని కథలు కల్పించాలనీ, రసవంతంగా చెప్పాలనీ సంకల్పమూ మొదటి ప్రయత్నమూ కూడా అక్కడే నాకు.

వల్లూరిలో నేను పడ్డ మరో ప్రపంచంలో, మళ్ళీ నా కిది యింకో ప్రపంచం.

నేను లేశమూ సంస్కారం లేనివాణ్ణి అయినా, ఆ ప్రపంచ స్వభావం అది కనక, అందులో పడ్డ వెంటనే నిర్ధారణ చెయ్యలేని ఆవేశం యేదో తలమున్కలయి పరవశుణ్ణి చేసేసేది న న్నుత్తరక్షణంలో.

అందువల్ల గోపురం దిగడం అంటే నా కెంతో బాధగా వుండేది.

పోనీ అంటే, గోపురశిఖరాలమీద సాధారణంగా సరీసృపాలుంటా యంటారు, చీకటి పడితే అవి అక్కడికి వస్తాయేమో అని జంకు.

సూర్యాస్తమయం అవుతుందనగా, సంధ్యావందనం నిమిత్తం తోటి విద్యార్థులు కోనేటికి వస్తారు, వూరివారితోబాటు పరమేశ్వరదర్శనమూ చేసుకుంటారు - అప్పుడు వాళ్ళతో వుండకపోతే యేమి చిక్కో అని కొంకు.

అది రచనా కాదు, రచనాసమాధి అసలే కాదు. సమాధి అంటే యేమిటో

46

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1